నమ్ముతారా?.. మాధురి దీక్షిత్ నటి అని పెళ్లినాటికి ఆమె భర్తకు తెలీదు!
on Oct 18, 2020
1990లలో ఆమె దేశంలోని ప్రతి ఒక్కరి హృదయ తంత్రులను మీటిన అందాల తార. అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్‌కూ ఆమె ఓ ఇన్స్పిరేషన్. ఆమె.. మాధురి దీక్షిత్. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తనకు తగిన వ్యక్తి శ్రీరామ్ నేనేను పెళ్లాడి, తనకంటూ సొంత లోకాన్ని సృష్టించుకొని, సినీ లోకాన్ని తాత్కాలికంగానైనా వదిలి వెళ్లిపోయింది మాధురి. తాను తీసుకున్న నిర్ణయం విషయంలో ఏనాడూ బాధపడాల్సిన సందర్భం ఆమెకు రాలేదు. అలాంటి అందాల స్వర్గాన్ని తన భర్తతో కలిసి నిర్మించుకుందామె.
తన డార్లింగ్ హబ్బీపై ప్రేమ కురిపించే అవకాశాన్ని ఆమె ఎన్నడూ మిస్ చేసుకోదు. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఓసారి పరికిస్తే, ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. శనివారం వారి పెళ్లిరోజు. 1999 అక్టోబర్ 17న ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ నేనేతో కలిసున్న రెండు పిక్చర్లను ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆ పిక్చర్లతో పాటు, "నా కలల్లోని వ్యక్తితో అడ్వంచర్స్తో నిండిన మరో సంవత్సరం ప్రారంభానికి నాంది ఈ రోజు. మేం ఒకరికొకరం భిన్నం కానీ ఏకంగా ఉంటాం. నా లైఫ్‌లో నిన్ను కలిగి ఉన్నందుకు కృతజ్ఞురాలిని. నీకు, మనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు రామ్" అని ఆమె ట్వీట్ చేశారు.
గమనించదగ్గ విషయమేమంటే, ఇద్దరికీ పెళ్లి కుదిరేనాటికి మాధురి ఒక నటి అని కానీ, బాలీవుడ్‌ను ఏలుతూ, అశేష అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోందని కానీ శ్రీరామ్‌కు తెలీదంట. కారణం.. అతను ఇండియన్ అమెరికన్. అమెరికాలోనే అతని నివాసం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మాధురి. "అది వినడానికి వండర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. నేను నటిననీ, హిందీ సినిమాల్లో నటిస్తుంటాననీ అతనికి తెలీదని నాకు తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. నిజంగా అతనికి నా గురించి అంతదాకా ఏమీ తెలీదు. కాబట్టి, అది వండర్ఫుల్" అని నవ్వుతూ చెప్పింది మాధురి.