అయ్యో లావణ్యా..! ఇప్పుడేం చేస్తావ్?
on Sep 22, 2017
అయ్యో... లావణ్య త్రిపాఠి... ఎన్ని తిప్పలొచ్చాయమ్మా నీకు! సినిమా ఒప్పుకున్నప్పుడు, డేట్స్ ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కదా! వాళ్లను ఇబ్బంది పెట్టడం ఏలా? నువ్వు ఇబ్బంది పడటం ఏలా? ఎందుకొచ్చిన గొడవమ్మా ఇదీ.. పైగా పోయి పోయి తమిళ తంబీలతో పెట్టుకుంటివి. అయ్యో... ఇంతకీ ఏమైందో మీకు చెప్పనే లేదు కదూ..
అదేనండీ... మన ‘100% లవ్’ సినిమా ఉందిగా! దాన్ని తమిళంలో ‘100% కాదల్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరో కాగా, మన లావణ్యే హీరోయిన్. చంద్రమౌళి అనే కొత్తాయన దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ లండన్ లో పెట్టుకున్నారట. యూనిట్ మొత్తం లండన్ బయలుదేరి వెళ్లిందట. లావణ్య మాత్రం షూటింగ్ కి డుమ్మా కొట్టేసిందట. పాపం.. ఏం ప్రాబ్లమ్ వచ్చిదో ఏమో.. పోనీ ఆ విషయాన్ని ముందుగా వాళ్లకు తెలియజేస్తే.. వాళ్లు లండన్ వెళ్లకుండా ఆగేవారూ.. ప్రత్యామ్నాయం ఆలోచించేవారు. కానీ... ఈ అమ్మడు.. సైలెంట్ గా ఉండి.. వాళ్లందరూ లండన్ వెళ్లాక ఒక్కసారిగా బాంబ్ పేల్చిందట. ఇంకేముందీ... యూనిట్ మొత్తం కూలబడిపోయింది. దాదాపు లక్షల్లో లాస్.. దాంతో దర్శక, నిర్మాతలు లావణ్యపై చర్య తీసుకోవాలని నిర్ణయించేశారు.
హుటాహుటిన చెన్నయ్ వచ్చేసి... దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలిలో లావణ్యపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో లావణ్యది నిజంగా పెద్ద తప్పు. సో... పీకల్లోతు కష్టాల్లో ఈ బెంగాళీభామ ఇరుక్కోవడం ఖాయం. మరి వారికి నష్టపరిహారం లావణ్య చెల్లిస్తుందా? ఒకవేళ చెల్లించినా.. ఈ వ్యవహారాన్ని అక్కడితో వదిలేస్తారని చెప్పలేం. ఎందుకంటే.. చాలామంది డేట్స్ కూడా వృధా అయిపోయాయ్ కదా. మరి ఈ సమస్య నుంచి లావణ్య ఎలా బయటపడుతుందో పాపం.
ఎందుకు లావణ్యా... ఇలాంటి పనిచేశావ్!.. ఇప్పుడేం చేస్తావ్?