తెలుగు సినిమాకు కొత్త కల్చర్ 'లక్షాధికారి'
on Jul 16, 2018
అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయ్. అలా జరిగిన ప్రతిసారీ.. చరిత్ర కొత్త మలుపు తీసుకుంటూ ఉంటుంది. అది ఏరంగులోనైనా. ముఖ్యంగా సినిమా రంగంలో. అడపాదడపా వచ్చే ఈ తరహా అద్భుతాలనే... కల్ట్ మూవీస్ అంటారు. సినిమా పరిభాషలో 'ట్రెండ్ సెట్టర్' అంటారు. ఈ సినిమాలూ... తెరకు కొత్త కల్చర్ నేర్పుతాయన్నమాట పాతాళభైరవి, మాయాబబార్, మిస్సమ్మ ఈతరహా సినిమాలే ఆ వరుసలోనే చెప్పుకోదగ్గ సినిమాయే 'లక్షాధికారి'.
'లక్షాధికారి'కి ముందు తెలుగు సినిమా అంటే... కష్టాలూ, కన్నీళ్లు, అనురాగాలూ, ఆప్యాయతలు, మహా అయితే... అప్పుడప్పుడు కాస్త హీరోయిజం. అయితే.. వాటితోపాటు సినిమా కథల్లోకి సస్పెన్స్ థ్రిల్లర్ అనే కొత్త అంశాన్ని కూడా చేర్చిన సినిమా 'లక్షాధికారి'.
కథలో అందరూ మనసున్న మనుషులే కనిపిస్తుంటారు. కానీ... ఎవరో ఓ అపరిచితుడు హత్యలు చేస్తూ ఉంటాడు. వాడి కారణంగా అమాయకులు బలైపోతుంటారు. అసలు ఈ హత్యలెందుకు జరుగుతున్నాయ్? సదరు వ్యక్తి ఏం ఆశించి ఈ హత్యలకు తెగబడుతున్నాడు? ఆసలు ఆ వ్యక్తి ఎవరు? ఇవన్నీ చూస్తున ప్రేక్షకుడ్ని వెంటాడే ప్రశ్నలు. హీరో ఆ దుర్మార్గుడికోసం వెతుకుతుంటాడు. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ... ఆ దుర్మార్గుడ్ని హీరో తుదముట్టిస్తాడు.
ఇలాంటి కథలు మనం చాల చూసుంటాం కదా. అవి మొదలైంది 'లక్షాధికారి' నుంచే. తొలిసారి ఇలాంటి కథను తెరపై చూసినప్పుడు అప్పటి జనాలు ఎలా ఫీలైవుంటారో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే 'లక్షాధికారి' ఓ ట్రెండ్ సెట్టర్. అందుకని ఈ సినిమాలో సస్పెన్స్ మాత్రమే ఉంటుందనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇందులో ప్రేమ ఉంటుంది. బంధాలకై వెతుకులాట ఉంటుంది. కర్ణపేయమైన టి. చలపతిరావు సంగీతం ఉంటుంది. కావాల్సినంత హీరోయిజం ఉంటుంది. టోటల్ గా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయ్. అందుకే సినిమా విడుదలైన 65 ఏళ్లయినా... ఇంకా జన హృదయాల్లో నిలిచేవున్నాడు 'లక్షాధికారి'.
ఇక ఎన్టీఆర్... ఏ ముహూర్తాన హీరో అయ్యాడో కానీ... మాస్ కి దేవుడై కూర్చున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో అయితే... మాస్ ని ఓ రేంజ్ లో మురిపించేశాడాయన. హిరోయిన్ కృష్ణకుమారితో రొమాన్స్ కానీయండీ... ఆ యుద్దాలు కానీయండి.. ఆ కామెడీ కానీయండి నిజంగా అద్భుతం అనుకోండి. ఈ ప్రయోగాత్మకమైన కథలో దర్శకుడు వి. మధుసూదనరావు చేసిన మరో వినూత్న ప్రయోగం రోబోలతో ఫైట్. 1963 లోనే ఆయన అంత కొత్తగా ఆలోచించాడు. కుదిరితే ఓ సారి చూడండీ... ఇప్పటి ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. ఆ ఫైట్. ఉత్కంఠకులోను చేస్తుంది.
ఇక ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి గుమ్మడి. మేకతోలు కప్పుకున్న పులి... నమ్మక ద్రోహి... గోముఖ వ్యాఘ్రం.. ఇలాంటి పేర్లకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాడు ఇందులో గుమ్మడి మహామహులు నటించిన ఈ సినిమాలో నటునిగా నంబర్ వన్ మాత్రం గుమ్మడే. ఆ పాత్ర గొప్పతనం అలాంటిది.
ఎన్టీఆర్, కృష్ణకుమారి, నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, గిరిజ... ఇలా వెండితెర దిగ్గజాలన్నీ నటించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఉన్నంతవరకూ మరపురానిదే. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి.