నా హైట్.. ప్రాబ్లెమ్ కాదు!
on Jul 7, 2020
"నా ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. అయితే హీరోలతో పనిచేయడానికి నా హైట్ ఓ ప్రాబ్లెమ్ అవుతుందని నేనే మాత్రమూ అనుకోవడం లేదు. పొడవుని బట్టి ఆఫర్లు వస్తాయంటే నేను నమ్మను. గతంలో అమీర్ ఖాన్‌తో నేనో యాడ్ చేశాను. ఆయనకంటే నేను పొడవు. అది చేసినప్పుడు నేను పొడవుగా ఉంటానని ఆయన ఏ మాత్రమూ ఫీల్ కాలేదు" అని చెప్పింది కృతి సనన్. తెలుగులో మహేశ్ సరసన '1.. నేనొక్కడినే' మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత నాగచైతన్య జోడీగా దోచెయ్ మూవీ చేసింది. దాని తర్వాత ఇంతదాకా మరో తెలుగు సినిమాకి ఆమె సంతకం చెయ్యలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం ఆమెకు మంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి.
కృతి ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. ఆమె తండ్రి ఒక చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. కృతి నోయిడాలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ చేసింది. సినిమాల్లోకి రాకముందు పలు కమర్షియల్స్‌లో నటించింది. మోడలింగ్ చేసింది. '1' మూవీలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి హైదరాబాద్ వచ్చింది. డైరెక్టర్ సుకుమార్‌ని మెప్పించి ఛాన్స్ కొట్టేసింది.
2019లో నాలుగు హిందీ సినిమాల్లో నాయికగా నటించింది కృతి. వాటిలో 'లుకా చుప్పీ', 'హౌస్‌ఫుల్ 4' సినిమాలు హిట్టవగా, 'అర్జున్ పాటియాలా', 'పానిపట్' సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినప్పటికీ 'పానిపట్'లో పార్వతీబాయిగా కృతి ప్రదర్శించిన నటన విమర్శకుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం 'మిమి' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో ఆమె నటిస్తోంది. నేషనల్ అవార్డ్ పొందిన మరాఠీ మూవీ 'మాలా ఆయి వాయ్చీ'కి రీమేక్‌గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సరొగేట్ మదర్ క్యారెక్టర్‌ను పోషిస్తోంది కృతి.