English | Telugu

అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!

on Feb 21, 2020

 

'క్రాక్' టీజర్‌లోని "అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!" డైలాగ్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్' మూవీలోంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సంద‌ర్భంగా శుక్రవారం సాయంత్రం యూట్యూబ్‌లో రిలీజైంది. 'డాన్ శీను', 'బలుపు' సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా 'క్రాక్'. రవితేజ మునుపటి సినిమాలు వరుసగా నాలుగు ఫ్లపైనా ఈ మూవీకి పాజిటివ్ బజ్ నడుస్తుండటం విశేషమే. 'బలుపు' తర్వాత రవితేజకు జోడీగా మరోసారి శ్రుతి హాసన్ నటిస్తోంది.
 
"ఒంగోలులో రాత్రి ఎనిమిది గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.." అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఆద్యంతం ఉత్కఠభరితంగా సాగింది. "అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!" అంటూ తనదైన శ్టైల్‌తో రవితేజ చెప్పిన డైలాగ్, టీజర్‌లోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను బాగా పెంచేలా ఉన్నాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాకు ప్లస్సవనున్నాయని ఆ డైలాగ్‌తో అర్థమవుతోంది. ఈ టీజర్‌ను రామానాయుడు స్టూడియోస్‌లోని ప్రివ్యూ థియేటర్‌లో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, "మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా మే 8న 'క్రాక్' మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. రవితేజ నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు  ఉంటాయి. టీజర్‌లో చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. మా యూనిట్‌కి మంచి కమర్షియల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాం. మా సినిమాటోగ్రాఫర్ విష్ణు అధ్బుతమైన విజువల్స్ అందించారు. టీజర్ లాగే మూవీలో కూడా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాం" అని చెప్పాడు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలను గోపీచందే సమకూర్చాడు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారని నిర్మాత బి. మధు చెప్పారు. టీజర్ ప్రకారం సముద్రకని ఒక పవర్‌ఫుల్ రోల్‌లొ కనిపించనుండగా, విజిల్ వేస్తూ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మరో ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ సినిమాకు ఎస్సెట్ అవడం ఖాయమని టీజర్‌తో తెలుస్తోంది. 'టచ్ చేసి చూడు' నుంచి మొదలైన రవితేజ పరాజన పరంపరకు 'క్రాక్' బ్రేక్ వేస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగిస్తోంది. మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Cinema GalleriesLatest News


Video-Gossips