English | Telugu

మెగాస్టార్ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందా?

on Nov 5, 2019

 

రైటర్ నుంచి డైరెక్టర్‌గా మారి నాలుగు సినిమాలు చేసిన కొరటాల శివ.. ఒక్కసారీ ఫెయిలవలేదు. తాను డైరెక్ట్ చేసిన ప్రతిసారీ ఆయా హీరోలకు ఆయన కమర్షియల్‌గా కెరీర్ బెస్ట్ మూవీని ఇవ్వడం గమనార్హం. 2013లో ప్రభాస్ హీరోగా నటించిన 'మిర్చి' మూవీతో ఆయన డైరెక్టర్‌గా పరిచయమైన విషయం మనకు తెలుసు. అది అప్పటివరకూ ప్రభాస్ సినిమాల్లోనే టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత మహేశ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టి 'శ్రీమంతుడు' తీశాడు కొరటాల. అది ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల రూపాయల షేర్ క్రాస్ చేసిన తొలి మహేశ్ మూవీగా రికార్డులకెక్కింది. 

ఈసారి వంతు జూనియర్ ఎన్టీఆర్‌ది. అతనితో కొరటాల రూపొందించిన 'జనతా గారేజ్' మూవీ వరల్డ్‌వైడ్‌గా 75 కోట్ల రూపాయల పైగా షేర్ సాధించి ఆ ఫీట్ చేసిన మొదటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా సాధించిన విజయంతో జూనియర్ ఎంత ఎమోషనల్ అయ్యిందీ మనం చూశాం. తనకు 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చిన కొరటాలతో మరో సినిమా చేశాడు మహేశ్. 'భరత్ అనే నేను' టైటిల్‌తో వచ్చిన ఆ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల పైగా షేర్ వసూలు చేసి, మహేశ్ కెరీర్‌లో ఆ ఘనత సాధించిన ఫస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది.

ఆ మూవీ రిలీజై ఒన్ అండ్ హాఫ్ యియర్ అయిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు కొరటాల. ఇప్పటివరకూ కొరటాల సినిమాలు ఆడిన విధం ప్రకారంగా చూస్తే, ఇది కూడా ఆ తరహాలోనే చిరంజీవి కెరీర్ బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అవ్వాలి. అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కమర్షియల్‌గా చూస్తే 'సైరా' మూవీ చిరంజీవి కెరీర్ బెస్ట్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ ప్రదర్శించిన అభినయం అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. కానీ బడ్జెట్ పరంగా చూస్తే.. థియేట్రికల్‌గా సగం డబ్బే రికవర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బాగానే వసూలు చేసినా, మిగతా ఏరియాల్లో ఆశించిన రీతిలో వసూళ్లు రాకపోవడం దెబ్బతీసింది. ఆ లోటును కొరటాల శివ తీరుస్తుందని మెగా ఫ్యాన్స్ దృఢంగా నమ్ముతున్నారు.

దాదాపు ఏడాదిగా చిరంజీవిని డైరెక్ట్ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు కొరటాల. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నిర్మాణ పనులు లాంఛనంగా మొదలయ్యాయి. చిరంజీవి కం బ్యాక్ ఫిల్మ్ 'ఖైదీ నంబర్ 150', ఇటీవల వచ్చిన 'సైరా.. నరసింహారెడ్డి' మూవీని నిర్మించిన రాంచరణ్.. ఇప్పుడు ఈ సినిమానీ నిర్మిస్తుండటం విశేషం. కాకపోతే ఆ రెండింటినీ సోలోగా ప్రొడ్యూస్ చేసిన అతను, ఈ మూవీని మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నాడు. 

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అవనుంది. ముందుగా ఒక సాంగ్ తీస్తారని సమాచారం. ఇది డాన్సర్స్‌తో కలిసి చిరంజీవి స్టెప్పులేసే సాంగ్ అని తెలుస్తోంది. డాన్స్ నంబర్స్‌కు చిరంజీవి పెట్టింది పేరనే విషయం మనకు తెలుసు. చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో సోలోగా డాన్స్ చేసిన సాంగ్స్ ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ఆ తరహాలోనే ఈ సాంగ్‌ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల.

ఈ మూవీలో చిరు జోడీగా సీనియర్ హీరోయిన్ త్రిష ఎంపికైంది. ఇంతకు ముందు ఆ ఇద్దరూ 2006లో వచ్చిన 'స్టాలిన్' మూవీలో జంటగా నటించారు. అంటే.. 13 సంవత్సరాల తర్వాత రెండోసారి వాళ్లు జోడీ కడుతున్నారు. త్రిష ఇటీవల తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం 'నాయకి' అనే హీరోయిన్ ఓరియెంటేడ్ మూవీలో ఆమె నటించింది. దాని తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే. దానికంటే ముందు 2015లో బాలకృష్ణ సరసన 'లయన్' మూవీ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ సరసన నటించే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుంది. ఈ మూవీలో ఆ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఏ లెవల్లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here