ఖైదీ నెం.150: ట్రైలర్ రివ్యూ
on Dec 8, 2016
బాస్ ఈజ్ బ్యాక్.. ఇంకెంత జస్ట్ నెల రోజులు అంతే..తొమ్మిదేళ్ల వన వాసం ముగించుకుని తనను అభిమానించే వారి కోసం వచ్చేస్తున్నాడు మెగాస్టార్. వివి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది చిరు 150వ చిత్రం ఖైదీ నెం.150. చాలా కాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండటం, ఆయన 150వ సినిమా కావడంతో ఖైదీ నెం.150పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి ఫోటోలు, పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమా అసలు కథను బ్రీఫ్‌గా చెప్పే ఉద్దేశ్యంతో ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది. మరి మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్న ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయో లేదో ఓ సారి చూస్తే..
"ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా..నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే కోస్తా"..అంటూ చిరు మార్క్ పవర్ఫుల్ డైలాగ్‌తో సాగే టీజర్లో మెగాస్టార్ మునపటిలా అందంగా ఉన్నారు. డైలాగ్ డెలివరీలో కానీ యాక్టింగ్‌లో కానీ తనలో వాడి వేడి ఇంకా తగ్గలేదని నిరూపించారు. చూస్తుంటే తమిళ కత్తిని కత్తిలాగా దించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ కాజల్ అగర్వాల్ అందచందాలు, విలన్ ఎలా ఉంటాడో చూపించకపోవడం వెనుక సస్పెన్స్ ఏంటో. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే రోటిన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పించి కొత్తగా ఏం లేవని అర్థమవుతోంది. మరి వెండితెరపై చిరు విన్యాసాలు చూడాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.