English | Telugu

ఖైదీ నెం.150 మూవీ రివ్యూ

on Jan 11, 2017

దాదాపు తొమ్మిది సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 ద్వారా అభిమానుల నిరీక్షణకు తెరదించారు. తన రీఎంట్రీ మూవీ కోసం ఎన్నో రకాల తర్జన భర్జనల తర్వాత తమిళ సూపర్‌హిట్ మూవీ కత్తిని రీమేక్‌ చేయాలని డిసైడవ్వడం అన్ని చకచకా జరిగిపోయింది. సినిమా చేసేశారు సరే..మరీ చిరులో మునుపటి వాడి వేడి ఎలా ఉంది..మళ్లీ ఆయనకు పునర్వై‌భవం వస్తుందా..? ఖైదీ నెం.150 అభిమానులను అలరించిందా లేదా చూద్దాం..!

కథ: 

దొంగతనాలు..మోసాలు చేసి కలకత్తా జైలు శిక్ష అనుభవిస్తుంటాడు కత్తి శీను ( చిరంజీవి) ..అదే జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీని పట్టించేందుకు జైలర్‌కు సాయపడ్డట్లే పడి..వాళ్లను బోల్తా కొట్టి జైలు నుంచి బయటపడి హైదరాబాద్ వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి తన స్నేహితుడు ( అలీ) సాయంతో విదేశాలకు పారిపోదామని ప్రయత్నిస్తాడు.. బ్యాంకాక్ వెళ్లబోతూ ఎయిర్‌పోర్టు‌లో లక్ష్మీ (కాజల్)ని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రయత్నం మానుకుంటాడు. ఆపై అనుకోని పరిస్థితుల్లో అచ్చం తనలాగే ఉన్న శంకర్(చిరంజీవి)ని చూసి షాకవుతాడు..వెంటనే ప్లాన్ వేసి శంకర్ ప్లేస్‌లోకి వెళ్లిపోయి..పోలీసుల దగ్గర శంకర్‌ను ఇరికిస్తాడు. శంకర్‌కి పాతిక లక్షలు రాబోతున్నాయని తెలుసుకోని అతను పెట్టిన ఓల్డేజ్ హోంకి వెళ్లగా, అక్కడ ఉన్నవారంతా శ్రీనునే శంకర్ అనుకోవటంతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడు.. అంతేకాదు తను ప్రేమించిన లక్ష్మీ కూడా అక్కడే ఉండటంతో శ్రీను డబుల్ హ్యాపీ. అంతా సాఫీగా సాగిపోతుందన్న సమయంలో శంకర్‌కి సన్మాన కార్యక్రమంలో భయంకరమైన విషయాలు తెలుస్తాయి. శంకర్ నీరూరు గ్రామస్థుల తరపున న్యాయం కోసం పోరాటం చేయటం గురించి తెలిసి శీను మారిపోతాడు. ఇంతకీ శంకర్ ఎవరు..అతడు ఎవరి కోసం ఉద్యమిస్తున్నాడు..ఆ ఉద్యమానికి శీను ఏ విధంగా తోడ్పడ్డాడు. ఈ క్రమంలో శీను విజయం సాధించాడా అనేది ఖైదీ నెం.150 కథ..


విశ్లేషణ:
తెలుగు సినీ సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాల పాటు రారాజులా ఏలిన మెగాస్టార్ సినిమాలకు దూరమై..మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆ సినిమాపై ఏ రేంజ్‌లో అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని రకాల లాభనష్టాలు బేరీజు వేసుకుని ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన కత్తిని రీమేక్ చేయడంలో వినాయక్ సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. కానీ ఒరిజనల్‌ని మక్కికి మక్కి దించేయడంతో ఖైదీ నెంబర్ 150లో కొత్తదనం లేదు. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోగా..సెకండాఫ్‌కి వచ్చేటప్పటికి నేరేషన్ కాస్త నెమ్మదించిందనే చెప్పాలి. ఐటెం సాంగులని..డ్యాన్సులని..కామెడీ అని అద్దిన కమర్షియల్ హంగులు చిరు అభిమానుల్ని బాగానే మెప్పిస్తాయి. కాజల్‌తో రొమాన్స్‌ సీన్స్‌లో మెగాస్టార్ కాస్త ఇబ్బంది పడినట్లే కనిపించారు. చిరంజీవి రాజకీయ జీవితాన్ని, చేదు అనుభవాల్ని గుర్తు చేసే డైలాగులు, వాటికి చిరు సమాధానాలు కూడా తెలివిగా కథలోకి చొప్పించారు. ఇక మెగాస్టార్ సినిమా అంటే చెప్పుకోవాల్సింది డ్యాన్సులే..చాలా మంది  డ్యాన్సుల కోసమే సినిమాలకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టే డ్యాన్సులు ఉండేలా ప్లాన్ చేశాడు వినాయక్. అయితే సినిమా చూస్తే చిరు డ్యాన్సుల్లో మునుపటి వేగం తగ్గిందని చెప్పవచ్చు. కానీ గ్రేస్‌ఫుల్ డ్యాన్సర్ కావడం వల్ల చిన్న స్టెప్స్‌నే ఎఫెక్టివ్‌‌గా చేసి కిక్ ఇచ్చారు మెగాస్టార్. 


నటీనటులు:
ఈ చిత్రానికి సర్వం తానే అయ్యారు చిరు..ఎలాంటి కొత్తదనం, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ లేకుండా వినాయక్ రెడీ చేసిన ప్రొడక్ట్‌ని సేల్ చేసే బాధ్యతని మెగాస్టార్ తీసుకున్నారు. రఫ్‌ లుక్కులో పాత మెగాస్టార్‌ను గుర్తు చేశాడు..యంగ్ లుక్క్ కోసం, బాడీ లాంగ్వేజ్ కోసం ఆయన పడిన కష్టం తెరపై కొట్టొచ్చినట్టు కనిపించింది. తనకు మాత్రమే సొంతమైన డ్యాన్స్‌, ఫైట్స్‌లో కుమ్మేశాడు..ముఖ్యంగా కామెడీ విషయానికి వస్తే స్టార్ కామెడీయన్లు అంతమంది ఉన్నా చిరు తనమార్క్ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడు. కత్తి శీనుగా, శంకర్‌గా ద్విపాత్రాభినయానికి పూర్తి న్యాయం చేశాడు. మొత్తం మీద పదేళ్ల గ్యాప్ వచ్చినట్లు ఎక్కడా కనిపించనీయలేదు చిరు. ఇక హీరోయిన్‌ విషయానికి వస్తే ..అప్పట్లో చిరంజీవి సినిమా అంటే హీరోయిన్‌‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉండేది..కానీ ఈ సినిమాలో కాజల్‌ని పాటల కోసమే తీసుకున్నారా అన్నట్లు అనిపిస్తుంది.  పెద్దగా గ్లామర్‌గా కూడా కనిపించలేదు. స్టైలిష్ విలన్‌గా తరుణ్ అరోరా మెప్పించాడు. చిరు స్నేహితుడిగా చివరి వరకు ఉండే పాత్రలో అలీ ఆకట్టుకున్నాడు. పోసాని, జయప్రకాశ్, బ్రహ్మానందంల కామెడీ సో సోగా నడిచిపోయింది.


సాంకేతిక వర్గం:
మురగదాస్ రమణ చిత్రాన్ని ఠాగూర్‌గా రీమేక్‌ చేసినప్పుడు బాగా శ్రమించిన వినాయక్‌కి ఈ సారి కత్తి విషయంలో మాత్రం మురుగదాసే మొత్తం అన్ని కమర్షియల్ అంశాలుండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో వినాయక్‌కి ఎక్స్‌ట్రా పని పడలేదు..వినోదం పండించడంలో, విసుగు పుట్టించుకుండా కథనం ముందుకు నడిపించడంలో వినాయక్ సక్సెస్ అయ్యాడు. మ్యూజీక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానుల్ని మెప్పించే మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రత్నవేలు సినిమాటోగ్రఫి ఫర్వాలేదు. పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా..వేమారెడ్డి డైలాగ్స్‌కి విజిల్సే..విజిల్స్.


ప్లస్ పాయింట్స్:

* చిరంజీవి
* డ్యాన్సులు, కామెడీ, డైలాగ్స్
* ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్:
* కాజల్
* బ్రహ్మానందం
* విలన్


రేటింగ్: 3/5

చివరగా: బాస్ ఈజ్ బ్యాక్

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here