పవన్‌తో ఫస్ట్ టైమ్.. హిస్టరీ కంటిన్యూ అవుతుందా?
on Jul 1, 2020
కొణిదెల కుటుంబ కథానాయకులకు స్వరవాణి కీరవాణితో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మరీ ముఖ్యంగా.. కీరవాణితో కొణిదెల వారి కథానాయకులు తొట్టతొలిసారి జట్టుకట్టినప్పుడు ఇండస్ట్రీ హిట్స్ వరించాయి. మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి ఫస్ట్ కాంబినేషన్లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ (1992) గత రికార్డులను తిరగరాస్తూ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగునాట రూ.10 కోట్ల షేర్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డులకెక్కింది. కట్ చేస్తే.. 17 ఏళ్ళ తరువాత చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో కీరవాణి తొలిసారి కలిసి పనిచేసిన ‘మగధీర’ (2009) రిలీజైంది. అటు వసూళ్ళపరంగానూ, ఇటు కేంద్రాలపరంగానూ అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘మగధీర’. అలాగే రూ.100 కోట్ల గ్రాస్ ఆర్జించిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలా కొణిదెల వారి కుటుంబంలో కీరవాణి ఫస్ట్ కాంబినేషన్ ఫిల్మ్స్ ‘ఇండస్ట్రీ హిట్’కి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి.
కొణిదెల కుటుంబంతో ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న కీరవాణి.. తన కెరీర్లో ఫస్ట్ టైమ్ ఆ ఫ్యామిలీలోని మరో స్టార్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో జట్టుకట్టాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియడ్ డ్రామాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించనున్నారు. మొఘలాయుల పరిపాలనా కాలంనాటి వాతావరణంతో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరి.. చిరు, చరణ్‌కి ఫస్ట్ టైమ్ కాంబినేషన్ పరంగా భలేగా అచ్చొచ్చిన కీరవాణి.. పవన్ కళ్యాణ్‌కి కూడా సెంటిమెంట్ పరంగా కలిసొచ్చి ‘ఇండస్ట్రీ హిట్’ హిస్టరీని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చిరంజీవి, కీరవాణి ఫస్ట్ కాంబినేషన్లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ ఫ్యామిలీ డ్రామాగా రూపొందితే.. రామ్ చరణ్, కీరవాణి తొలి కలయికలో వచ్చిన ‘మగధీర’ సోషియో ఫాంటసీ ఫోక్లోర్ మూవీగా తెరకెక్కింది. ఇక ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న పవన్, కీరవాణి ఫస్ట్ కాంబినేషన్ ఫిలిమ్ హిస్టారికల్ ఫిక్షన్‌గా తయారవుతోంది. మొత్తమ్మీద.. కొణిదెల కాంపౌండ్‌లో కీరవాణి ఫస్ట్ టైమ్ చేసిన సినిమాలన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ కావడం విశేషం.