హిందీ నిర్మాత కుమార్తెకు కరోనా
on Apr 6, 2020
బాలీవుడ్లో మరో కరోనా కేసు నమోదు అయింది. అయితే... సినిమా ప్రముఖులు ఎవరికీ ఈ వ్యాధి సోకలేదు. కానీ, ప్రముఖులతో పరిచయాలు కలిగిన నిర్మాత కుమార్తెకు వచ్చింది. షారుక్ ఖాన్ హీరోగా నటించి, స్వీయ నిర్మాణ సంస్థ రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆయన భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ‘రా. వన్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘దిల్ వాలే’ చిత్రాలకు వన్నాఫ్ ది ప్రొడ్యూసర్‌గా పని చేసిన కరీమ్ మొరానీ కుమార్తె షాజా అనారోగ్యంతో హాస్పటల్‌కి వెళ్లగా కోవిడ్19 పాజిటివ్ అని తేలిందట. దాంతో కరీమ్ మొరానీ ఫ్యామిలీ క్వారంటైన్లోకి వెళ్లింది.
మంగళవారం ఫ్యామిలీలో తొమ్మిదిమందికి కరోనా టెస్టులు చేయనున్నారు. అలాగే, వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారనేది ఆరా తీస్తున్నారు. విదేశాలకు వెళ్లి వచ్చినవారితో తన కుమార్తె సన్నిహితంగా తిరగలేదనీ, ఆమెలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదనీ కరీమ్ తెలిపారు. కరోనాతో కలకలం సృష్టించిన బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు వ్యాధి నయం కావడంతో ఆమెను డిశ్చార్ట్ చేశారు.