కంగన స్టైల్.. 'జల్లికట్టు'కు పొగడ్తలు.. బాలీవుడ్‌కు తిట్లు!
on Nov 26, 2020
మనసులో అనిపించింది బయట పెట్టడానికి ఏమాత్రం వెనుదీయని తారగా కంగన రనౌత్ పేరుపొందిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆమె వ్యాఖ్యలు అనేకం కాంట్రవర్సీ సృష్టిస్తూ రావడం మనం చూస్తున్నాం. తాజాగా ఆస్కార్‌కు ఇండియా అఫిషియల్ ఎంట్రీగా ఎంపికైన మలయాళ చిత్రం 'జల్లికట్టు'ను పొగడ్తలతో ముంచెత్తిన ఆమె, అదే అదునుగా బాలీవుడ్‌ను ఏకి పారేశారు.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించిన ఆమె బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో 2021 ఆస్కార్ నామినేషన్‌కు భారత ఎంట్రీగా ఎంపికైనందుకు 'జల్లికట్టు' టీమ్‌ను ప్రశంసించారు. అదే సమయంలో.. భారతీయ సినిమాలనేవి కేవలం నాలుగు సినీ కుటుంబాలకు చెందినవి కావని ఆమె అన్నారు. "బుల్లీదావూద్ గ్యాంగ్‌ను స్క్రుటినీ చేస్తుండటం ఎట్టకేలకు కొన్ని ఫలితాలను ఇస్తున్నాయి. మూవీ మాఫియా ముఠా వారి వారి ఇళ్లల్లో దాక్కుని, జ్యూరీలు తమ పని తాము చేసుకోనివ్వండి" అని ఆమె రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జ్యూరీకి ఆమె అభినందనలు తెలిపారు.
చపాక్, శకుంతలా దేవి, ఛలాంగ్, గులాబీ సితాబో, ఈబ్, అల్లాయ్ వూ, ద స్కై ఈజ్ పింక్, బుల్బుల్, ద డిసిపుల్ తదితర 26 చిత్రాలతో పోటీపడి ఆస్కార్ ఎంట్రీగా 'జల్లికట్టు' ఎంపికైంది. ఎస్. హరీశ్ రాసిన 'మావోయిస్ట్' అనే చిన్న కథ ఆధారంగా లిజో జోస్ పెల్లిస్సేరీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జంతువుల కన్నా అధ్వాన్నంగా మనుషుల్లోని నైజాలు ఉంటాయనే నిజాన్ని బయటపెడుతుంది.
Also Read