English | Telugu

రివ్యూ: క‌ణం

on Apr 27, 2018

 

ఇప్పుడు కావాల్సింది స‌రికొత్త ఆలోచ‌న‌లు. ముత‌క సినిమాలూ, పాత చింత‌కాయ ప‌చ్చ‌డి క‌థ‌లూ అవ‌స‌రం లేదు.ఎక్క‌డో చోట‌.. కాస్త కొత్త‌ద‌నం క‌నిపించినా - చాలు. వీర‌తాళ్లు వేయ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు ప్రేక్ష‌కులూ, విమ‌ర్శ‌కులూ.`క‌ణం`లో ఆ  కొత్త ఆలోచ‌న క‌నిపిస్తుంది. కొత్త‌గా చెప్పాల‌న్న త‌ప‌న మెప్పిస్తుంది. ఓ విధంగా ఇదో సీరియ‌స్ పాయింట్‌. దాన్ని ప్రేక్ష‌కులు అర్థం చేసుకునే దారిలో చెప్పాడు ద‌ర్శ‌కుడు.  ఆత్మ క‌థ‌ల్ని, దెయ్యాల సినిమాల్ని భ‌య‌పెట్ట‌డానికి తీస్తారు. కానీ.... `క‌ణం` మాత్రం ఓ ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది. ఇంత‌కీ `క‌ణం`లో ప్ర‌స్తావించిన ఆపాయింట్ ఏమిటి?  ఏ మేర‌కు మ‌న‌లో మార్పుని తీసుకొస్తుంది?

* క‌థ‌

పెళ్లికి ముందే తొంద‌ర‌ప‌డుతుంది ఓ జంట‌. ఫ‌లితం... 19 ఏళ్ల వ‌య‌సులోనే ఆ అమ్మాయి అబార్ష‌న్ చేయించుకోవాల్సివ‌స్తుంది. త‌న క‌డుపులో ఓ జీవం ఉంద‌న్న సంగ‌తి తెలుసుకున్న ఏ అమ్మాయికైనా పిండంపై మ‌మ‌కారం పెరుగుతుంది. ఆ అమ్మాయికీ అంతే. త‌న క‌డుపులోనే హ‌త‌మైపోయిన పాప‌కు `దియా` అనే పేరు పెట్టుకుంటుంది. కానీ... దియాని ఈ లోకం చూడ‌నిస్తే క‌దా?   ఇంట్లోవాళ్లంతా క‌ల‌సి బ‌ల‌వంతంగా అబార్ష‌న్ చేయిస్తారు. ఐదేళ్ల తర‌వాత అదే అబ్బాయితో ఆఅమ్మాయికి పెళ్ల‌వుతుంది.కానీ.. ఆ అమ్మాయికి దియా ఆలోచ‌న‌లే. `ఆరోజు అబార్ష‌న్ చేయించుకోక‌పోతే ఐదేళ్ల దియా మ‌న మ‌ధ్య ఉండేది క‌దా` అని ప్ర‌తిక్ష‌ణం కుమిలిపోతుంటుంది. కానీ త‌న‌కి తెలియ‌ని విష‌యం ఏమిటంటే.. దియా ఎక్క‌డికీ వెళ్లిపోలేదు. ఆ ఇంట్లోనే, త‌న తల్లి చుట్టూనే ఓ ఆత్మ‌లా తిరుగుతుంటుంది. ఐదేళ్ల పాప‌కి త‌ల్లంటే ఎంత ప్రేమో... త‌న‌ని క‌డుపులోనే చంపేసిన వాళ్ల‌పై అంత కోపం. అందుకే వాళ్లంద‌రిపైనా ప‌గ తీర్చుకుంటుంటుంది. అదెలా??  ఆ త‌ర‌వాత ఏం జరిగింది?  అనేదే `క‌ణం` క‌థ‌.* విశ్లేష‌ణ‌

ఆత్మ‌, దెయ్యం క‌థ‌లు ఇలాంటి పాయింట్‌తోనూ రాసుకోవ‌చ్చా?  అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. పిండం ఆత్మ‌లా రావ‌డం ఏమిటి?  ప‌గ తీర్చుకోవ‌డం ఏమిటి?  అనే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. నిజానికి బ్రూణ హ‌త్య అనే పాయింట్‌పై రాసుకున్న క‌థ ఇది. పిండాన్ని స‌మాధి చేయ‌డం కూడా నేర‌మే. అభం శుభం తెలియ‌ని ఆప్రాణాన్ని.. లోకం చూడ‌కుండానే గొంతు నొక్కేయ‌డం క్ష‌మించ‌రాని నేరం. ఈ పాయింట్‌ని ఇంత `రా`గా చెబితే ఎవ‌రికీ ఎక్క‌దు. అదేదో యాడ్ లా ఉంటుంది. అందుకే దానికి హార‌ర్‌, థ్రిల్ల‌ర్ కోటింగు ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని ఎంత తెలివిగా, ఎంత గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడంటే... ఒక్క‌టంటే ఒక్క వేస్ట్ సీన్ క‌నిపించ‌దు (పోలీస్ స్టేష‌న్‌లో ప్రియ‌ద‌ర్శి చేసే వెలికి వేషాలు మిన‌హా). తొలి స‌న్నివేశం నుంచే క‌థ‌లోకి వెళ్లిపోయాడు. అంద‌మైన హీరో, గ్లామ‌ర్ ఉన్న హీరోయిన్ దొరికారు క‌దా అని వాళ్ల మ‌ధ్య ప్రేమ గీతాలు, రొమాన్స్ ఇరికించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. క‌థ‌ని డిస్ట్ర‌బ్ చేసే ఏ విష‌యాన్నీ ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోలేదు. అందుకే స‌న్నివేశాలు చ‌క‌చ‌క సాగిపోతుంటాయి.

సాధార‌ణంగా ఆత్మ‌ని చూస్తే భ‌యం, ఏవ‌గింపూ క‌ల‌గాలి. కానీ దియాని చూస్తే ముచ్చ‌టేస్తుంటుంది. ఇంత అంద‌మైన పాప‌ని క‌డుపులోనే చంపేశారా?  అనే బాధ క‌లుగుతుంది. ఆ పాత్ర‌తో ఎమోష‌న‌ల్ బాండింగ్ ఏర్ప‌డుతుంది. తల్లీ కూతుర్ల మ‌ధ్య క‌నీక‌నిపించ‌ని అనుబంధాన్ని ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపించాడు. విశ్రాంతి ముందు ఘ‌ట్టం త‌ప్ప‌కుండా క‌దిలిస్తుంది. ద్వితీయార్థంలో క‌థ నెమ్మ‌దిస్తుంది. ఇలాంటి క‌థ‌ల స‌హ‌జ ల‌క్ష‌ణ‌మే అది. సినిమా కాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా మ‌ళ్లీ ప్రాణం వ‌స్తుంది. ప‌తాక స‌న్నివేశాల్ని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ ముందే రాసుకుని, దాని ఆధారంగా ఈ క‌థ‌ని రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అంత క‌రెక్ట్‌గా కుదిరింది

* న‌టీన‌టులు

సాయి ప‌ల్ల‌వి మ‌రోసారి వంద‌కి వంద మార్కులు తెచ్చుకుంటుంది. ఓ ఇల్లాలిగా, త‌ల్లిగా ఆమె న‌ట‌న న‌చ్చుతుంది. దియా కోసం ప‌రిత‌పించే స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న ఇంకా బాగుంది. నాగ‌శౌర్య కూడా త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. అత్యంత స‌హ‌జంగా న‌టించాడు. దియా పాత్ర‌లో క‌నిపించిన అమ్మాయి ముద్దుగా, అమాయ‌క‌త్వంగా క‌నిపించి క‌ట్టి ప‌డేస్తుంది. ప్రియ‌ద‌ర్శి ఫ‌ర్వాలేద‌నిపిస్తాడు. మిగిలిన‌వాళ్లంతా త‌మిళ మొహాలే.

* సాంకేతికంగా

కెమెరా, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటాయి. రెండే రెండు బిట్ సాంగ్స్‌కి చోటుంది ఈ క‌థ‌లో. వాటిని కూడా థీమ్ పాయింట్ చెప్ప‌డానికి వాడుకున్నాడు. ఈ క‌థ‌ని ఇలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడి నేర్పు తెలుస్తుంది. విశ్రాంతి ఘట్టం, క్లైమాక్స్ ల‌ను చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. తాను చెప్ప‌ద‌ల‌చుకున్న పాయింట్‌.. ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూసుకున్నాడు.

* ప్ల‌స్ పాయింట్స్‌

సాయి ప‌ల్ల‌వి
నేప‌థ్య సంగీతం
 క్లైమాక్స్‌

* మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డ స్లో.

* చివ‌రిగా:   క‌ణం.. ఓ మంచి ప్ర‌య‌త్నం!

రేటింగ్: 2.75


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here