అల్లరి నరేశ్ జోడీగా కాజల్ అగర్వాల్!
on Mar 11, 2020
అనూహ్యమైన జోడీ కుదిరింది. చిన్న చిన్న హీరోయిన్లతో సరిపెట్టుకుంటూ వస్తోన్న అల్లరి నరేశ్‌కు ఇప్పుడు ఏకంగా కాజల్ అగర్వాల్ జోడీగా దొరికింది. అవును. ఈ కాంబినేషన్‌ను సెట్ చేసిన వ్యక్తి.. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు. ఇదివరకు సౌత్ కొరియన్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'మిస్ గ్రానీ'ని 'ఓ బేబీ' పేరుతో నిర్మించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు మరో సౌత్ కొరియన్ మూవీ 'డాన్సింగ్ క్వీన్'ను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మూవీకి డైరెక్టర్ కంటే ముందే ప్రధాన పాత్రధారులను ఆయన ఎంపిక చేసుకోవడం విశేషం.
మొదటే అల్లరి నరేశ్‌ను ఒక పాత్రకు ఎంచుకున్న ఆయన, ఇప్పుడు సినిమాలో అతని భార్య పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు. ఆమె కూడా సబ్జెక్ట్, క్యారెక్టర్ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ చివరి కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే ఒక దంపతుల జంట కథ ఈ చిత్రం. కామెడీ హీరోగా పేరు పొందిన నరేశ్, అప్పుడప్పుడు సీరియస్ రోల్స్ చేస్తూ నటుడిగా తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. ఇటీవల మహేశ్ స్నేహితుడిగా 'మహర్షి' మూవీలో అతను ప్రదర్శించిన నటన అందరి మెప్పూ పొందింది. ఇప్పుడు మరోసారి ఒక భిన్న పాత్రను చేయడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఏదేమైనా కాజల్, అల్లరి నరేశ్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుందనేది నిజం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.