హ్యాపీ బర్త్ డే... తారక్
on May 20, 2017
అద్భుతమైన నటనతో ..అదిరిపోయే డాన్సులతో ...గగుర్పాటు కలిగించే డైలాగుల గర్జనతో...మదిమదిలో నిలిచిపోయిన టాలీవుడ్ యంగ్ స్టార్... ఎన్టీఆర్. నేడు ఆయన పుట్టిన రోజు.నటసార్వభౌముడి వారసుడిగా తెలుగు తెరకు బాల్యంలోనే అంకురార్పణ చేసుకొని అంచెలంచెలుగా ఎదిగిన స్టార్ హీరో ...మన ఎన్టీఆర్.
తొలిసారి కథానాయకుడిగా 'నిన్ను చూడాలని' చిత్రంతో తొలి అడుగులు వేసి.. స్టూడెంట్ నెం 1 చిత్రంతో సూటిగా నిలదొక్కుకొని...'సుబ్బు' చిత్రంతో అభిమానమనే మబ్బులను కప్పుకొని ... 'ఆది'తో అందరి మదిలో నిలిచి.."సింహాద్రి" తో సింహంలా అగ్ర కథానాయకుడిగా పేరొంది, వరుస చిత్రాలతో వణుకు పుట్టించి....యమదొంగ తో ..అభిమానుల గుండెలను దోచి ..తనపై బెంగ పెట్టుకునే స్థాయికి అభిమానులను తీసుకు వచ్చి , కంత్రి లా కలవరపరచి కమ్మని మాస్ కు బాస్ లా ఎదిగి , అదుర్స్ అనిపించుకుని , బృందావనం తో బంధాలను బలపరిచి , మహోన్నత 'శక్తి'గా విశ్వరూపాన్ని చూపించి ..'టెంపర్' తో సూపర్ అనిపించుకుని .. 'నాన్నకు ప్రేమతో 'సందేశం ఇచ్చి..జయహో జనతా అంటూ 'జనతా గ్యారేజ్ ను విజయాల బ్యారేజ్ గా మలిచి సాటిలేని హీరోగా నిలబడ్డాడు.
ఆయన కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా యమదొంగ చిత్రంతో స్వరాన్ని అందించి...కన్నడ నాట ఒక పాడి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయి నిలిచిన తొలి తెలుగు తార మన ఎన్టీఆర్. ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని ... అంచెలంచెలుగా అగ్ర కథానాయకుడిగా కృషి తో .. పట్టుదలతో ..ఎదిగిన తారక్ ప్రయాణం రాబోయే తరాలకు సరికొత్త జీవనయానం గా నిలిచింది. తొలిసారి త్రిపాత్రాభినయం తో 'జై లవ కుశ' చిత్రం తో రానున్నాడు. ప్రయోగాల అన్వేషిగా తన అఖండ నటనా కౌశల్యాన్ని విశ్వ వ్యాప్తం చేస్తున్న ఎన్టీఆర్ మరెన్నో చిత్రాలతో టాలీవుడ్లో గొప్ప నట తారక మంత్రంగా కీర్తించబడాలని కోరుకుంటూ ...తెలుగు వన్ .. తెలియజేస్తుంది జన్మ దిన శుభాకాంక్షలు ...