బాలకృష్ణగా జూ.ఎన్టీఆర్?
on Oct 31, 2018
హాట్ హాట్ న్యూస్... నందమూరి బాలకృష్ణగా జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడట! నందమూరి తారక రామారావు బయోపిక్ 'యన్.టి.ఆర్'కి జూనియర్ ఎన్టీఆర్ చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తే బావుంటుందని దర్శకుడు క్రిష్ భావించారు. అదే మాటను ఎన్టీఆర్ తనయుడు, బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ చెవిలో వేశారు. బాలకృష్ణ ఏమన్నారో ఇంకా బయటకు రాలేదు. ఈలోపు ఫిలింనగర్లో, కృష్ణానగర్‌లో కొత్త కబురు చక్కర్లు కొడుతోంది. అదేంటంటే... 'యన్.టి.ఆర్' బయోపిక్‌లో బాలకృష్ణ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడని! సినిమాలో తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అందువల్ల, సినిమాలో తన పాత్రలో తానే పోషించడం బాలకృష్ణకు కుదరని పని. ఆ పాత్రకు ఎవరో ఒక నటుణ్ణి తీసుకురావాలి. అదీ పేరున్న నటుడు చేయాలి. లేదంటే బాగోదు. ఈ లెక్కలు వేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించే అవకాశాలను కొట్టి పారేయలేం. కానీ, ఆ అబ్బాయిపై బాబాయి కోపం తగ్గిందా? ఇద్దరి మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయా? అనేది సందేహం! ఒక్కటి మాత్రం నిజం... బాలకృష్ణగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే సినిమాకు ఎక్స్ట్రా మైలేజి వస్తుంది. నందమూరి హీరోలు అందరూ సినిమాలో వున్నట్టు అవుతుంది.
బాలకృష్ణగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే... ప్రస్తుతానికి అతణ్ణి బాలకృష్ణ తన నట వారసుడిగా చూసినట్టే. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇంకా తెరంగేట్రం చేయలేదు కనుక. మోక్షజ్ఞ తెరపైకి రానంత మాత్రానా... ఎన్టీఆర్‌ని వారసుడని ఎలా అంటారు? అనే సందేహాలు కొందరికి రావొచ్చు. సినిమాలో తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ నట వారసుడు ఆయనే కదా! అక్కినేని పాత్రలో సుమంత్ నటిస్తున్నారు. అక్కినేని నట వారసుల్లో సుమంత్ ఒకరు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. హరికృష్ణ నట వారసుల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. తన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. నందమూరి కుటుంబం నుంచి అతణ్ణి తన నట వారసుడిగా చెప్పకనే చెప్పినట్టు అవుతుంది.