English | Telugu

జెస్సీ మూవీ రివ్యూ

on Mar 15, 2019

నటీనటులు: ఆషిమా నర్వాల్, శ్రిత‌ చందన, అర్చన, అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, పావనీ గంగిరెడ్డి, అభినవ్ గోమటం, విమల్ కృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్
మాటలు, పాటలు: కిట్టు విస్సాప్ర‌గ‌డ‌
ఎడిటర్: గ్యారీ బిహెచ్
సినిమాటోగ్రఫీ: ఎన్. సునీల్ కుమార్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాత‌: శ్వేతా సింగ్ రాథోడ్
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వి. అశ్వినికుమార్
విడుదల తేదీ: మార్చి 15, 2019

ప్రేక్షకుల్లో సినిమాను వినోదం కోసం చూసేవాళ్ళ సంఖ్య ఎక్కువ. కళల్లో నవరసాలు ఉన్నట్టు... ఈ వినోదంలోనూ నవరసాలు ఉన్నాయి. అందులో భయానకం ఒకటి. భయపడుతూ వినోదం పొందే ప్రేక్షకులు ఎక్కువే. అందుకు హారర్‌ సినిమాలు సాధిస్తున్న విజయాలే ఉదాహరణలు. ప్రేక్షకులను భయపెట్టి, వినోదం పంచి, విజయం సాధించాలని ఈ రోజు ‘జెస్సీ’ అనే హారర్‌ సినిమా విడుదలైంది. దాదాపుగా అందరూ కొత్తవారే నటించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ:

హార్స్‌లీ హిల్స్‌లోని విక్టోరియా హౌస్‌లో దెయ్యాలు ఉన్నాయా? లేవా? అని తేల్చి చెప్పాడానికి ఘోస్ట్‌ హంటర్స్‌ గ్యాంగ్‌ (పావనీ గంగిరెడ్డి, అభినవ్‌ గోమటం, మరో ఇద్దరు) ఒకటి బయలుదేరుతుంది.  మార్గమధ్యలో వాళ్ళకు సమీర (అర్చన) కనబడుతుంది. విక్టోరియా హౌస్‌కు దారి చూపించమని అడిగితే... ఆ ఇల్లు తనదేనని అంటుంది. తాను జర్మనీలో ఉంటున్నానని, ఇల్లు అమ్మేద్దామంటే దేయ్యాలు ఉన్నాయని ఎవరూ కొనడం లేదని, మీరు దెయ్యాలు లేవని నిరూపిస్తే ఇల్లు అమ్మేస్తా అని ఘోస్ట్‌ హంటర్స్‌ గ్యాంగ్‌కి సమీర చెబుతుంది. అందరూ కలిసి విక్టోరియా హౌస్‌కి వెళతారు. దెయ్యాలు ఉన్నాయని అర్థమవుతుంది. గతంలో ఆ ఇంటిలో నివసించే ఇద్దరు అక్కచెల్లెళ్ళు జెస్సీ (ఆషిమా నర్వాల్‌), ఎమీ (శ్రిత చందన) కారు ప్రమాదంలో మరణిస్తారు. జెస్సీ ఆత్మగా మారి ఇంటిలో నవసిస్తుంది. తన కథను ఘోస్ట్‌ హంటర్స్‌కి స్వయంగా టీవీలో చూపిస్తుంది జెస్సీ. కథ కంచికి చేరే సమయంలో అప్పటివరకూ ఘోస్ట్‌ హంటర్స్‌కి జెస్సీ రూపంలో కనిపించినది హైదరాబాద్‌లో ఉండే ట్విన్‌ సిస్టర్స్‌లో ఒకరు (ఆషిమా నర్వాల్‌) అని, ఆమెలో జెస్సీ ఆత్మ ఆవహించిందని తెలుస్తుంది. మరి, అసలు జెస్సీ ఎవరు? ట్విన్‌ సిస్టర్స్‌లో ఒకరి శరీరంలో ఎందుకు ప్రవేశించింది? జెస్సీ, ఎమీ సిస్టర్స్‌ కథేంటి? సినిమాలో జెస్సీ ఫ్రెండ్‌ రాజీవ్‌ (విమల్‌కృష్ణ), పోలీసాఫీసర్‌ (అతుల్‌ కులకర్ణి), భూతవైద్యుడు (కబీస్‌ సింగ్‌) పాత్రలు ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ:

పక్కా కమర్షియల్‌ హారర్‌ ఫార్ములాను అనుసరించి తెరకెక్కిన చిత్రమిది. సాధారణంగా హారర్‌ సినిమాల్లో కెమెరా మూమెంట్స్‌తో, రీరికార్డింగ్‌తో ప్రేక్షకులను భయపెడతారు. ఈ సినిమాలో అటువంటి ట్రిక్కులను ఉపయోగించారు. థ్యాంక్స్‌ టు శ్రీచరణ్‌ పాకాల రీరికార్డింగ్‌. చాలా సీన్స్‌లో అసలు విషయంలో ఏం లేకుండా అతను ప్రేక్షకులను భయపెట్టాడు. ఫస్టాఫ్‌లో కథ తక్కువ, హారర్‌, థ్రిల్లర్‌ మూమెంట్స్‌ ఎక్కువ అన్నట్టు నడిచింది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలైన తరవాత కథలో, కథనంలో, హారర్‌ థ్రిల్స్‌ ఇవ్వడంలో వేగం తగ్గింది. దానికి తోడు వెంటవెంటనే రెండుమూడు ట్విస్టులు వచ్చాయి. అవి బావున్నా... ప్రేక్షకులు అర్థం చేసుకునేంత లోపల మరో ట్విస్ట్‌ రావడం మైనస్సే. ట్విస్టులు బుర్రకు కొంచెం పని పెడతాయి. ఆత్మ, భ్రాంతి అంటూ సైకాలజీనీ, హారర్‌నీ మిక్స్‌ చేశారు. ఇక, కథకి వస్తే... జెస్సీ ఎందుకు ఆత్మగా మారిందనేదానికి సరైన కారణం లేదు. చెల్లెలు ట్రీట్‌మెంట్‌ కోసమని సర్ధి చెప్పుకుందామన్నా... జెస్సీ, ఎమీ మధ్య సిస్టర్‌ బాండింగ్‌ చూపించనేలేదు. దాంతో కొన్ని సీన్స్‌ పండలేదు. అయితే... సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ ఆ లోటును మ్యాగ్జిమమ్‌ కవర్‌ చేశాయి. సినిమా టేకింగ్‌, మేకింగ్‌, స్టోరీ... సౌత్ కొరియన్ సినిమా 'ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్' స్ఫూర్తితో ‘జెస్సీ’ తీసినట్టు అర్థమవుతూ ఉంటుంది.

ప్లస్‌ పాయింట్స్‌:

శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం
సునీల్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ
గ్యారీ బీహెచ్‌ ఎడిటింగ్‌
కథలో మలుపులు

మైనస్‌ పాయింట్స్‌:

ఆషీమా నర్వాల్‌ నటన
అసలు కథ

నటీనటులు పనితీరు:

ఆషిమా నర్వాల్‌ ఒక్కటే ఎక్స్‌ప్రెషన్‌తో సినిమా అంతా నెట్టుకొచ్చింది. కొద్దో గొప్పో నటించే హీరోయిన్‌ ఎవరైనా ఉంటే బావుండేది. కథంతా ఒక్క నటి మీద ఎక్కువసేపు నడిచేటప్పుడు, నటన వచ్చినవారిని తీసుకుంటే సినిమా ఇంకాస్త స్థాయి పెరిగేది ఆషిమా నర్వాల్ సిస్టర్ పాత్రలో శ్రిత చందన బాగా చేసింది. పాత్రకు తగ్గట్టు ఆమె నటించింది. అతుల్‌ కులకర్ణిది అతిథి పాత్రే. ఉన్నంతలో ఆయన బాగానే చేశారు. ‘హై బడ్జెట్‌ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌లా రెండుమూడుసార్లు వచ్చాడు’ అని అతడి పాత్రపై ఒక సెటైర్‌ కూడా వేశారు. కబీర్‌ సింగ్‌ పాత్ర పరిథి కూడా తక్కువే. పావనీ గంగిరెడ్డి యాక్టింగ్‌, యాటిట్యూడ్‌ బావున్నాయి. అర్చనది రొటీన్‌ యాక్టింగ్‌!

చివరగా:

‘జెస్సీ’ కథ కొత్తది కాదు. సన్నివేశాలూ కొత్తవి కావు. కానీ, కొన్నిచోట్ల భయపెడుతుంది. అంతా శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం మహిమే. హారర్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే చాలా హాలీవుడ్‌ హారర్‌ సినిమాలు చూసుంటే దూరంగా ఉండటం మంచిది.

రేటింగ్: 2.25/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here