'జెర్సీ' మూవీ 400 శాతం ప్రాఫిట్స్ అందించింది: నాని
on Sep 7, 2019
నాని మునుపటి సినిమా 'జెర్సీ' విమర్శకుల ప్రశంసల్నీ, ప్రేక్షకుల ఆదరణనీ పొందిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాగా ఉంది కానీ, కమర్షియల్‌గా ఆశించిన రీతిలో ఆడలేదనే మాటలు వినిపించాయి. వీటిపై తాజాగా నాని స్పందించాడు. ఈ నెల 13న అతని 'నానీస్ గ్యాంగ్ లీడర్' విడుదలవుతోంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జెర్సీ' బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కు వెరీ హ్యాపీగా ఉన్నానని చెప్పాడు.
"ఒక 36 ఏళ్ల క్రికెటర్ రోల్ ప్లే చేసి, వాడికో ఫ్యామిలీనీ, కొడుకునీ పెట్టి, వాడొక లూజర్ అనీ, ఫిజికల్ ఫిట్నెస్ లేదని చెప్పి, ట్రాజిక్ క్లైమాక్స్ ఇచ్చి, మన తెలుగు సినిమాకి యాంటీ క్లైమాక్స్ కష్టమనే రూల్‌ని, మన నమ్మకాన్నీ ప్రతి యాంగిల్లోనూ బ్రేక్ చేస్తూ వెళ్లిన సినిమా 'జెర్సీ'. థియేట్రికల్‌గా రూ. 30 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే.. దాన్ని తక్కువని ఎలా అంటాం! ఎగ్జాంపుల్.. 'ఎంసీఏ' రిలీజైనప్పుడు నాకింకా గుర్తు. దాని గురించి కొంత మంది రాస్తూ "డబ్బులు సరే కానీ, నాని మంచి సినిమాలు చెయ్యడా?" అని రాశారు. 'జెర్సీ' రిలీజయ్యాక "మంచి సినిమా సరే కానీ, 'ఎంసీఏ'ని కొట్టదా?" అన్నారు. మరి నేనెటు వెళ్లమంటారు? మీరే నాకు డైరెక్షన్ ఇవ్వండి. వి షుడ్ హావ్ సమ్ క్లారిటీ. మనకు సెల్ అయ్యే ఎలిమెంట్స్.. రొమాన్సో, లవ్ స్టోరీయో, సెక్సో, ఫైట్సో, వయొలెన్సో.. ఇవేవీ లేకుండా తీసిన సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసి, దాన్ని హిందీలో, తమిళంలో, కన్నడంలో.. అన్ని చోట్లా రిలీజ్ చేస్తుంటే.. 'అనుకున్నంత ఆడలేదు' అంటారెందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కానీ, దానికి వచ్చిన కలెక్షన్స్ కానీ పూర్తిగా జస్టిఫైడ్. కమర్షియల్‌గా బాగా డబ్బులు చేసుకోవాలని ఆ సినిమా చెయ్యలేదు. మేమేదైతే ఆ సినిమా నుంచి ఆశించామో, అది పూర్తిగా నెరవేరింది. రేపు చైనాలోనూ ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ రకంగా చూసుకుంటే, ఆ సినిమా మాకు 400 శాతం ప్రాఫిట్స్ అందించింది" అని చెప్పుకొచ్చాడు నాని.