ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించిన హాలీవుడ్ స్టార్.. నాలుగో పెళ్లికి రెడీ!
on Nov 24, 2020
ఆమెకు 51 సంవత్సరాల వయసంటే ఎవరు నమ్ముతారు? నవంబర్ 22న జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ (ఏఎంఏ) వేడుకలో ఆమె ఇచ్చిన ప్రదర్శన చూస్తే జెన్నిఫర్ లోపెజ్ అలియాస్ జేలోకు అంత వయసు ఉంటుందని ఎవరూ అనుకోరు. బ్లాక్ క్యాట్‌సూట్‌లో ఆమె కిల్లర్ బాడీని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించింది అతిథులకు. ఇప్పుడు నవంబర్ 24న తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన తన కొత్త సాంగ్ 'ఇన్ ద మార్నింగ్' టీజర్ వీడియోలో జేలో తన ఫ్యాన్స్‌కు ఏం చూపించిందో తెలుసా? తన ఫియాన్స్ అలెక్స్ రోడ్రిగెజ్ తొడిగిన 15 క్యారెట్ డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను!
అవును. 45 సంవత్సరాల అలెక్స్‌తో మూడేళ్ల నుంచీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది జేలో. ఇప్పటికి ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. అలెక్స్‌ను పెళ్లాడితే అది ఆమెకు నాలుగో పెళ్లవుతుందన్న మాట. మొదట యాక్టర్ ఒజాని నోవాను పెళ్లాడిన జేలో ఏడాది తిరిగేసరికల్లా1998లో అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత మూడేళ్లకు మరో నటుడు క్రిస్ జడ్‌ను వివాహమాడి రెండేళ్లే కలిసుండి 2003లో డైవోర్స్ ఇచ్చింది. మరో ఏడాదికే అమెరికన్ సింగర్ మార్క్ ఆంథోనీని పెళ్లాడిన ఆమె ఈసారి పదేళ్ల పాటు కాపురం చేశాక 2014లో ఆయనకు గుడ్‌బై చెప్పేసింది.
మూడేళ్ల పాటు సింగిల్‌గా ఉన్న ఆమె 2017లో 'ఎ-రాడ్'గా ఫ్యాన్స్ పిలుచుకొనే బేస్‌బాస్ ప్లేయర్ అలెక్స్ రోడ్రిగెజ్ ప్రేమలో పడి, అప్పట్నుంచీ అతనితో సహజీవనం చేస్తూ వస్తోంది. ఇప్పుడు 'ఇన్ ద మార్నింగ్' టీజర్ వీడియోలో ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించడంతో త్వరలోనే వారి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఆ సాంగ్ ఎప్పుడు రిలీజవుతుందనే విషయం జేలో వెల్లడించలేదు. టీజర్‌లో జేలోని చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉంటారా? ఒక యూజర్ “THE HOTTEST WOMAN IN THE WORLD” అని కాంప్లిమెంట్ ఇస్తే, మరో యూజర్ “YOURE STUNNINGGGG.” అని కామెంట్ చేశాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
