బాహుబలిని కావాలనే పక్కనబెట్టారా..?
on Nov 4, 2016
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షంతో పాటు అవార్డులు కూడా బాహుబలిని వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ సినిమా అవార్డును సైతం సాధించి తెలుగోడి సత్తా ఏంటో నిరూపించింది. అలాంటి బాహుబలి చిత్రానికి ఘోరమైన అవమానం జరిగింది. ప్రతిష్టాత్మక గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ప్రదర్శనకు నోచుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా 230 సినిమాల జాబితా ను తయారు చేయగా అందులో తెలుగు నుంచి ఆరు సినిమాలు పోటీపడ్డాయి. కానీ ఒక్క తెలుగు సినిమా కూడా ప్రదర్శనకు నోచుకోలేదు. బాహుబలిని అయితే కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఇది కావాలని చేసిందా లేదంటే పొరపాటు జరిగిందా అనేది తేలాల్సి ఉంది. దీనిపై టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ స్పందించలేదు.