కార్తీకి సినిమా చూపించిన హైదరాబాద్ ట్రాఫిక్
on Jul 17, 2018
ఒకప్పుడు కార్తీ అంటే సూర్య తమ్ముడే! కానీ ఆవారా, నా పేరు శివ, ఊపిరి, శకుని లాంటి సినిమాలతో తెలుగువాళ్లకి కూడా బాగానే పరిచయం అయ్యాడు కార్తీ. తాజాగా ‘చినబాబు’ సినిమాతో తెలుగువారి ముందుకి వచ్చాడు. ఇప్పటిదాకా రకరకాల పాత్రలు పోషించిన కార్తీ, చినబాబుతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్ర ప్రమోషన్ కోసం హైదరాబాదుకి చేరుకున్న కార్తీకి నగరంలో ట్రాఫిక్ ఓ ఝలక్ ఇచ్చింది. ప్రసాద్ లాబ్స్‌లో జరిగే సక్సెస్ మీట్‌కి చేరుకోవాలనుకున్న కార్తీకి అడుగడుగునా ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఒకవైపు ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు, మరోవైపు నిలిచిపోయిన నీళ్లతో బండి అడుగు కూడా ముందుకి కదల్లేదు. దాంతో ఇక చిరాకేసిపోయిన కార్తీ ఆటో తీసుకుని ప్రసాద్ ల్యాబ్స్‌కు చేరుకున్నాడట. మిగతా స్టార్ హీరోలతో పోల్చుకుంటే కార్తీ DOWN TO EARTH అని టాక్ ఇప్పటికే ఉంది కానీ... ఆయన మరీ ఇంత నిరాడంబరుడు అని ఎవరూ ఊహించలేదు. మన టాలీవుడ్ హీరోలు ఇలా చేయగలరా అన్నదే ఇప్పుడు అనుమానం!