'హ్యాపీ డేస్' నాటికి వరుణ్ సందేశ్ ప్లస్ టూ కూడా పూర్తి చేయలేదు!
on Oct 18, 2020
శేఖర్ కమ్ముల డిస్కవరీ వరుణ్ సందేశ్ 'హ్యాపీ డేస్'తో గ్రాండ్‌గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి, 'కొత్త బంగారులోకం'తో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. 'ఏమైంది ఈవేళ' అంటూ పలకరించిన ఆ బక్కపలచని హీరో తర్వాత కాలంలో క్రమంగా ప్రేక్షకుల మనసుల నుంచి ఫేడవుట్ అయిపోయాడు. దానికి కారణాలెన్నో ఉండొచ్చు. అతడికీ అవి తెలిసుండవచ్చు. బిగ్ బాస్ 3లో అతడిని చూసి ఎలాంటి ఇమేజ్ పొందిన 'కుర్రాడు' ఎలాంటి స్థితికి వచ్చాడని బాధపడిన వాళ్లు ఉన్నారు. చిన్న వయసులోనే వచ్చిన అనూహ్యమైన క్రేజ్‌తో బ్యాలెన్స్ తప్పి, కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్లే అతను కెరీర్లో వెనకపడి పోయాడని విశ్లేషకులు భావిస్తుంటారు.
వరుణ్ సందేశ్‌కు సంబంధించి చాలా మందికి తెలీని విషయం 'హ్యాపీ డేస్' సినిమా చేసే నాటికి అతడు ప్లస్ టూ చదువుతున్నాడు. దాన్ని ఆపేసి వచ్చి ఆ సినిమా చేశాడు. అదొక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. శేఖర్ కమ్ముల తన సినిమా కోసం కొత్తవాళ్లు కావాలని ఇచ్చిన ప్రకటన చూసి, ఓ రాయి విసురుదామని అమెరికా నుంచి తన ప్రొఫైల్ పంపించాడు. అది చూసి, ఇ-మెయిల్లో రెండు సీన్లు రాసి, వాటిని యాక్ట్ చేసి పంపమన్నాడు శేఖర్. ఆ సీన్లను కెమెరా ముందు అభినయించి, ఆ వీడియో క్లిప్పింగ్స్ పంపాడు వరుణ్. ఆ వెంటనే 'హ్యాపీ డేస్' ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనీష్ కురువిల్లా నుంచి కాల్ వచ్చింది. "నువ్వు చందు రోల్‌కు సెలక్ట్ అయ్యావు. వెంటనే హైదరాబాద్ వచ్చేయి" అన్నాడాయన. మొదట నమ్మలేకపోయాడు వరుణ్. నమ్మాక, ఎగిరి గంతేశాడు. కుర్రాడి ఉత్సాహం చూసి అమ్మానాన్నలు సరేనన్నారు. దాంతో.. ఠక్కున హైదరాబాద్‌లో వాలిపోయాడు.
'హ్యాపీ డేస్' షూటింగ్ అయిపోయి, సినిమా విడుదలైంది. వరుణ్‌కు అభినందనల పరంపర మొదలైంది. సినిమా ఆడుతున్న థియేటర్లకు వెళితే "చందు.. చందు" అంటూ జనం చేసే గోల చూసి అతడికి పిచ్చెక్కిపోయింది. రాత్రికి రాత్రే తను కాలేజీ యూత్‌కు ఆరాధ్య నటుడైన సంగతి అతడికి క్రమంగా అర్థమైపోయింది. నిన్నటి దాకా తను అనామకుడు. నేడు.. వేలాది మందికి తెలిసిన సెలబ్రిటీ. కలలాంటి నిజం. వరుణ్ ఆనందం అంతటితో ముగియలేదు. ఆ వెంటనే మరో గుడ్ న్యూస్. దిల్ రాజు నిర్మించ తలపెట్టిన 'కొత్త బంగారులోకం' మూవీలో అతడికి హీరో ఆఫర్. ఈలోగా అమెరికా వెళ్లి ప్లస్ టూ పూర్తి చేసి వచ్చాడు. హీరో కాకపోయుంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివి, దానికి సంబంధించిన ఉద్యోగంలో ఉండేవాడు వరుణ్. కెరీర్ స్టార్టింగ్‌లోనే హ్యాపీ డేస్ చూసిన అతను ఇప్పుడు బ్యాడ్ డేస్ ఎదుర్కొంటూ ఉండటం చూస్తే జీవితం ఒక నాటకం అనిపించక మానదు.
Also Read