'హిట్' ట్రైలర్: కొత్తగా కనిపిస్తోన్న విశ్వక్ సేన్!
on Feb 19, 2020
'ఫలక్‌నుమా దాస్' వంటి హిట్ మూవీ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' మూవీ ట్రైలర్ బుధవారం యూట్యూబ్‌లో రిలీజయ్యింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై హీరో నాని ప్రెజెంట్ చేస్తొన్న ఈ మూవీని ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తోంది. డాక్టర్ శైలేష్ కొలను ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. 'చి.ల.సౌ' ఫేం రుహానీ శర్మ హీరోయిన్. 'హిట్' ట్రైలర్ చూస్తుంటే ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన 'దిశ' ఘటన గుర్తుకొస్తోంది. కారు ఆగిపోవడం వల్ల ఒక యువతి రోడ్డుపక్కన ఆగడం, అటువైపు వచ్చిన ఒక పోలీసాఫీసర్ (మురళీ శర్మ) ఆమెను చూసి ఆగి మాట్లాడి, 'పోతామరి.. మేనేజ్ చేసుకుంటావుగా' అనడిగితే, ఆమె 'ష్యూర్ సర్.. థాంక్యూ' అనడం మనకు ఆ ఉదంతాన్నే గుర్తుచేస్తోంది. ఆ వెంటనే అదే పోలీసాఫీసర్ దగ్గరకు తమ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదని ఒక దంపతుల జంట వస్తుంది.
మొత్తానికి మిస్సయిన ఆ అమ్మాయి కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత 'సీఐడీ'లోని 'హిట్' (హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం)కు చెందిన ఇన్స్పెక్టర్ విక్రం రుద్రరాజుపై పడుతుంది. అది అతడికి ఫస్ట్ కేసు. దీన్నతడు ఎలా పరిశోధించి, వాస్తవాలు వెలికితీశాడనే అంశాన్ని థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ రూపొందించినట్లు ట్రైలర్ చెబుతోంది. 'ఫలక్‌నుమా దాస్'గా యమ ఎనర్జిటిగ్గా నటించి మెప్పించిన విశ్వక్ ఈ సినిమాలో దానికి పూర్తి భిన్నమైన విక్రం రుద్రరాజు క్యారెక్టర్లో కనిపించి ఆశ్చర్యపరచనున్నాడు. అతడికి కూడా ఏదో గతం ఉందనీ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా అది గుర్తుకొచ్చి అతను పానిక్ అవుతున్నాడని కూడా తెలుస్తోంది. అతని గతమేంటి? అదేమైనా బాధాకరమైందా? ఆ విషయాలు తెలుసుకోవాలంటే 'హిట్' చూడాల్సిందే. ట్రైలర్ మాత్రం ఒక మంచి అనుభవాన్ని ప్రేక్షకులకు ఇచ్చేట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదలవుతోంది.