'లక్ష్మీ బాంబ్' టైటిల్ మార్చాలి.. హిందూ సేన డిమాండ్!
on Oct 21, 2020
రోజురోజుకూ భారతీయుల్లో అసహనం స్థాయి తీవ్రతరమవుతోంది. సంతోషంగా సాగే మతాంతర వివాహాన్ని చూపించిందంటూ తనిష్క్ యాడ్‌ను ఉపసంహరించుకొనేలా చేయడం దగ్గర్నుంచి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయంటూ సినిమాలను బహిష్కరించడం దాకా ఎన్నో నిదర్శనాలు దీనికి కనిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ సినిమా 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ రిలీజ్ అయినప్పట్నుంచీ, దానిపై రకరకాల వివాదాలు తలెత్తాయి. మతాంతర వివాహాన్ని చూపిస్తున్నందున ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, ఆ సినిమా టైటిల్ వారికి సమస్యాత్మకంగా కనిపిస్తోంది.. ఎందుకంటే, ఆ టైటిల్లో హిందూ దేవత లక్ష్మీదేవి పేరును ఉపయోగించడం!
ఇప్పుడు సినిమా టైటిల్‌ను మార్చాలంటూ హిందూ సేన డిమాండ్ చేస్తోంది. లేకపోతే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తోంది. ఆ సినిమాపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ సంస్థ కేంద్ర సమాచార-ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఓ లేఖ రాసింది. సినిమా టైటిల్‌తో సమస్య ఉందని ఆరోపించిన వారు, ఆ టైటిల్ హిందూ దేవత లక్ష్మిని ఎగతాళి చేసేలా ఉందని, తద్వారా హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తోందని చెప్పారు.
తమ డిమాండ్లను నెరవేర్చకపోయినట్లయితే సినిమా హాళ్ల బయట నిరసనలు తెలియజేస్తామని ఆ లేఖలో వారు హెచ్చరించారు. అలాగే టైటిల్‌ను మార్చకపోతే ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాల్సిందిగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన 'లక్ష్మీ బాంబ్' మూవీలో కియారా అద్వానీ నాయికగా నటించింది. నవంబర్ 9న అది విడుదలవుతోంది.
Also Read