'ఆర్ఆర్ఆర్' నిర్మాతకు హార్ట్ సర్జరీ
on Jun 2, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్న డీవీవీ దానయ్యకు గుండెపాటు వచ్చింది. అయితే, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగుంది. గత వారం ఆయనకు గుండెలో చిన్న నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. యాంజియోగ్రామ్ చేసిన డాక్టర్స్ హార్టులో స్టంట్ వేశారు. హార్టులో రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడ్డాయట. ఇప్పుడు డీవీవీ దానయ్య కోలుకుంటున్నారని సమాచారం.
లాక్డౌన్ కారణంగా అన్ని సినిమాలతో పాటు 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ కూడా ఆగింది. అయితే ఈ సినిమాని అన్ని సినిమాలతో పోల్చి చూడలేం. ఇద్దరు స్టార్ హీరోలు, 'బాహుబలి' తర్వాత రాజమౌళి కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా. రెండొందల కోట్ల పెట్టుబడితో తీస్తున్న సినిమా. త్వరగా షూటింగులు స్టార్ట్ చేయలేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయలేరు. అప్పుడు కోట్ల రూపాయల రొటేషన్ ఆగుతుంది. వడ్డీలు పెరుగుతాయి. బహుశా... ఈ టెన్షన్స్ వలన ఆయనకు గుండెనొప్పి వచ్చి ఉంటుందని గుసగుస.