ఈ నలుగురూ ఒక్కరేనంటే నమ్ముతారా!?
on Apr 20, 2021
హాలీవుడ్‌లోని మోస్ట్ టాలెంటెడ్, వెర్సటైల్ యాక్టర్లలో కచ్చితంగా ఆండీ సెర్కిస్ పేరు ఉంటుంది. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలను అతి సునాయాసంగా పోషిస్తూ వస్తున్నాడు సెర్కిస్. అన్నిటికీ మించి మోషక్ కాప్చర్ క్యారెక్టర్స్‌లో సెర్కిస్ నటనా వైవిధ్యం చూడాల్సిందే. 2005లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'కింగ్ కాంగ్'లో టైటిల్ రోల్లో కనిపించింది సెర్కిసేననే విషయం చాలా మందికి తెలీదు. మోషన్ కాప్చర్ విధానం ద్వారా ఆయన రూపాన్ని కాంగ్‌గా మార్చేశాడు డైరెక్టర్ పీటర్ జాక్సన్.
అంతేనా.. 'రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్' (2011)లో కానీ, 'వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్' (2017)లో కానీ ప్రధాన పాత్ర అయిన సీజర్ అనే ఏప్గా నటించింది సెర్కిస్.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్'లో ఏలియన్ తరహాలో కనిపించే గొల్లుమ్ పాత్ర చేసింది కూడా ఆయనే.
'స్టార్‌వార్స్' సిరీస్‌లో అస్థిపంజరానికి చర్మం తొడిగినట్లుండే సుప్రీమ్ లీడర్ స్మోక్ పాత్రధారి సెర్కిస్ అంటే ఎవరైనా నమ్మగలరా!
అదీ ఆండీ సెర్కిస్ వెర్సటాలిటీ. వాయిస్ ఆయనకు అతి పెద్ద ఎస్సెట్. పాత్రకు తగ్గట్లుగా వాయిస్‌ను మార్చేయగల దిట్ట కావడం వల్లే భిన్నతరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు.
ఆయన కేవలం నటుడే కాదు, మంచి డైరెక్టర్ కూడా. రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన కథతో వచ్చిన 'మౌగ్లి: లెజెండ్ ఆఫ్ ద జంగిల్'ను డైరెక్ట్ చేయడమే కాకుండా అందులోని ఎలుగుబంటి బల్లూగా నటించింది, వాయిస్ ఇచ్చింది ఆయనే. 2017లో వచ్చిన 'బ్రీత్'.. డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ ఫిల్మ్. ప్రస్తుతం 'వెనమ్'కు సీక్వెల్ 'వెనమ్: లెట్ దేర్ బి కార్నేజ్'ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఆయన పుట్టినరోజు.