రాజశేఖర్ 'కల్కి'కి సీక్వెల్ ప్లాన్స్...
on Feb 4, 2019
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్... సారీ 'యాంగ్రీ స్టార్' అనాలి. ఎందుకంటే... 'కల్కి' సినిమా పోస్టర్లలో రాజశేఖర్ పేరు ముందు 'యాంగ్రీ స్టార్' అని దర్శకుడు ప్రశాంత్ వర్మ వేస్తున్నారు. ఈరోజు రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'కల్కి' టీజర్ విడుదల చేశారు. అందులో రాజశేఖర్ ని 'యాంగ్రీ స్టార్' గా పేర్కొన్నారు. పిఎస్వి గరుడవేగ సినిమా విజయం తర్వాత రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు చూస్తుంటే... గరుడవేగ తరహాలో క్వాలిటీతో రిచ్ గా తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. కల్కి లో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇంతకుముందు పలు చిత్రాల్లో రాజశేఖర్ పోలీస్ పాత్రలో నటించారు. వాటికి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నారు. అంతేకాదు... కల్కి చిత్రానికి సీక్వెల్స్ కూడా చేయాలని అనుకుంటున్నట్లు టీజర్ విడుదల కార్యక్రమంలో తన మనసులో మాటను బయటపెట్టారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది రాజశేఖర్ పుట్టినరోజుకి 'కల్కి 2' పనుల్లో ఉంటామని అన్నారు. కమర్షియల్ హంగులతో రూపొందుతున్న కల్కి సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పారు. పుట్టిన రోజు కూడా రాజశేఖర్ 'కల్కి' షూటింగ్ చేస్తున్నారు. ఇంకా 30% సినిమా షూటింగ్ బాలన్స్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో సినిమా పూర్తి చేసి మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు.