ENGLISH | TELUGU  

గీత గోవిందం మూవీ రివ్యూ

on Aug 15, 2018

 

తారాగ‌ణం :  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం:  గోపీసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌
నిర్మాణం :  జీఏ2 పిక్చ‌ర్స్‌
స‌మ‌ర్ప‌ణ :  అల్లు అర‌వింద్‌
నిర్మాత :బ‌న్నీ వాసు
క‌థ, ద‌ర్శ‌క‌త్వం, మాట‌లు :  ప‌ర‌శురామ్‌

త‌న‌కు కాబోయే భార్య‌లో అమ్మ ప్రేమ‌, వాత్స్య‌ల్యాన్ని కోరుకునే సంప్ర‌దాయ భావాలు క‌లిగిన యువ‌కుడు, అమ్మంటే ఓ దేవ‌తా స్వ‌రూపం..భార్య ఎప్ప‌టికీ అమ్మ కాలేదు కాబ‌ట్టి వ‌రించిన అమ్మాయినే అమ్మ‌గా చూసుకోవాల‌ని భావించే ఓ అమ్మాయి...కొంత విరుద్దభావాలు క‌లిగిన, మ‌రికొన్ని సారుప్య‌తలు క‌లిగిన ఓ జంట క‌లిసి చేసే ప్ర‌యాణం, ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డే మ‌న‌స్ప‌ర్థ‌లు, అనుమానాలు, అనురాగాలు, అల‌క‌లు, విర‌హం, వియోగం...వీట‌న్నింటి క‌ల‌బోతే గీత గోవిందం. మ‌న‌సును త‌ట్టే భావోద్వేగాలు, మ‌న‌సారా న‌వ్వించ‌గ‌లిలే హాస్యం ఉంటే ప్రేమ‌కథ‌లెప్పుడూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తూనే ఉంటాయి. గీత గోవిందం చిత్రంలో ఈ ల‌క్ష‌ణాల‌న్ని పుష్క‌లంగా ఉన్నాయి. అర్జున్‌రెడ్డి చిత్రంతో విజ‌య్‌దేవ‌ర‌కొండ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. దీంతో ఆయ‌న త‌దుప‌రి చిత్రం గురించి యువ‌త ఉత్సుక‌త‌తో ఎదురుచూస్తున్నారు. మ‌హాన‌టి చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. అయితే అర్జున్‌రెడ్డి త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం గీత గోవిందం కావ‌డంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్ష‌కుల్లో, అటు ట్రేడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. గీతా ఆర్ట్్స వంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి వ‌స్తున్న‌చిత్రం కావ‌డం కూడా ఈ సినిమాపై అంచ‌నాల్ని పెంచింది. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన గీత గోవిందం క‌థాకమామీషు ఏమిటో ఓ సారి చూద్దాం..

క‌థ‌:

కాలేజీలో లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు విజ‌య్ గోవిందం (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). ఆధునిక యువ‌కుడైనా సంప్ర‌దాయాల్ని అమితంగా గౌర‌విస్టుంటాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి నిత్యం క‌ల‌ల్లో విహ‌రిస్తుంటాడు. కాబోయే శ్రీ‌మ‌తి స‌ర్వ‌స్వంలా జీవితాన్ని గ‌డ‌పాల‌ని స్వ‌ప్పాల్లో తేలిపోతుంటాడు. ఓ రోజు గుడిలో త‌న ఊహా సుంద‌రిలాంటి అమ్మాయైన గీత (ర‌ష్మిక మంద‌న్న‌)ను చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న చెల్లెలి పెళ్లి కోసం సొంత ఊరు కాకినాడు వెళుతున్న అత‌నికి బ‌స్సులో గీత తార‌స‌ప‌డుతుంది. ఈ ప్ర‌యాణంలోనే గీత‌తో ప‌రిచ‌యం పెంచుకోవాల‌నుకుంటాడు గోవిందం. ఈ క్ర‌మంలో అనుకోకుండా గీత విషయంలో త‌ప్పు చేస్తాడు గోవిందం. త‌న‌తో గోవిందం అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాడ‌ని గీత కోపోద్రిక్తురాల‌వుతుంది. త‌న అన్న‌య్య (సుబ్బ‌రాజు)తో చెప్పి గోవిందం భ‌ర‌తం ప‌ట్టించాలనుకుంటుంది. తీరా కాకినాడ వెళ్లాక త‌న చెల్లిని పెళ్లాడేది గీత అన్నయ్యే అని తెలుసుకుంటాడు గోవిందం. ఈ క్ర‌మంలో గోవిందం, గీత మ‌ధ్య ఏం జ‌రిగింది?  గీత త‌న అన్న‌య్య‌కు గోవిందం గురించి నిజం చెప్పిందా?  రెండు వారాల పాటు హైద‌రాబాద్‌లో క‌లిసి ప్ర‌యాణం చేసిన గీత‌, గోవిందం చివ‌ర‌కు ఏం తెలుసుకున్నారు? ఇద్ద‌రి క‌ల‌హాల ప్ర‌ణ‌యం ఏ విధంగా సుఖాంతం అయింది? ఇవ‌న్నీ తెర‌పై చూడాల్సిందే...

 

 

విశ్లేష‌ణ‌...

ప్రేమ‌క‌థ‌కు అంద‌మైన అల్లిక ముఖ్యం. క‌థాంశం ఏదైనా దానిని ప్రేక్ష‌క‌రంజ‌కంగా చెప్ప‌డంలోనే సృజ‌నాత్మ‌కత దాగి వుంటుంది. క‌థాప‌రంగా గీత గోవిందం న‌వ్య‌మైన‌దేమి కాదు. అనూహ్య మ‌లుపులు, అతిశ‌యోక్తులు ఏమి వుండ‌వు. ఓ చిన్న క‌థ‌ను అర్థ‌వంత‌మైన స‌న్నివేశాల కూర్పుతో చ‌క్క‌టి హాస్యంతో తీర్చిదిద్దారు ద‌ర్శ‌కుడు ప‌రశురామ్‌. బ‌స్సు ప్ర‌యాణంలో అనుకోకుండా  గోవిందం చేసిన తప్పును గీత అపార్థం చేసుకోవ‌డంతో ఇద్ద‌రి పాత్ర‌ల మ‌ధ్య ఏర్ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, ఆ త‌ర్వా క‌లిసి చేసే ప్ర‌యాణంలో గీత‌గోవిందం న‌డుమ‌ చోటుచేసుకునే సంఘ‌ట‌న‌లు...వీట‌న్నింటిని క‌న్విన్సింగ్‌గా తెర‌పై తీసుకొచ్చారు. ప్రథ‌మార్థ‌మంతా గీత‌గోవిందం మ‌ధ్య త‌లెత్తే అపోహ‌లు, గిల్లికజ్జాల‌తో ఆద్యంతం హాస్య‌భ‌రితంగా సాగింది. గోవిందంపై గీత ఎప్పుడూ చిట‌ప‌ట‌లాడ‌టం, మేడ‌మ్ మేడ‌మ్ అంటూ గీత‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి గోవిందం చేసే ప్ర‌యాస చ‌క్క‌టి వినోదాన్ని పండించాయి. దీనికి రాహుల్ రామ‌కృష్ణ (అర్జున్‌రెడ్డి ఫేమ్‌) మిత్ర బృందం జ‌త‌కావ‌డంతో హాస్యం ప‌రిపూర్ణంగా పండింది. గోవిందం మిత్రుడైన  రాహుల్‌రామ‌కృష్ణ‌..అత‌ని స్నేహితుల బ్యాచ్ పండించిన కామెడీ ఆసాంతం న‌వ్వించింది. ఇక ద్వితీయార్థంలో గీత‌..గోవిందు మంచిత‌నం గురించి తెలుసుకోవ‌డం, అత‌నికి ద‌గ్గ‌ర కావ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు..ఈ క్రమంలో ఇద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న‌ల్‌  స్ట్ర‌గుల్‌ను హార్ట్ ట‌చింగ్‌గా ఆవిష్క‌రించారు. ప్రీక్లైమాక్స్‌లో గీత‌, గోవిందం న‌డుమ అన్న‌వ‌రం దేవాల‌యంలో న‌డిచే ఎపిపోడ్ భావోద్వేగ‌భ‌రితంగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఘ‌ట్టాల్లో వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బా న‌వ్విస్తుంది. ఎక్క‌డా  విసుగు లేకుండా రెండున్న‌ర‌గంట‌ల పాటు క‌థ‌,  క‌థ‌నాల్ని అద్బ‌తంగా న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. సంభాష‌ణ‌లు బాగున్నాయి. బిగిస‌డ‌ల‌ని క‌థ‌నంతో, చ‌క్క‌టి కామెడీతో సినిమాను అర్థ‌వంతంగా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ క‌నిపిస్తుంది.

న‌టీన‌టుల ప‌నితీరు..

ఈ క‌థ‌కు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పాత్ర‌లు మూల‌స్తంభాలుగా నిలిచాయి. తెర‌పై వీరిద్ద‌రి జంట అందంగా, క‌న్నుల‌పండువ‌గా అనిపించింది. ముఖ్యంగా విజ‌య్‌దేవ‌ర‌కొండ సెటిల్డ్ ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. అర్జున్‌రెడ్డి వంటి స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్ త‌ర్వాత ఇలాంటి సాఫ్ట్ అండ్ ఎమోష‌న‌ల్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒదిగిపోయిన తీరు అమోఘంగా అనిపిస్తుంది. విజ‌య్ నట‌న‌ను ఎక్క‌డా వేలేత్తి చూపించే ఆస్కారం క‌న‌బ‌డ‌దు. ర‌ష్మిక సినిమా ఆసాంతం సీరియ‌స్‌గా క‌నిపించినా ఆమె హావ‌భావాలు, చ‌క్క‌టిరూపం మెప్పిస్తాయి. ప‌తాక‌ఘ‌ట్టాల్లో అన్న‌పూర్ణ‌, వెన్నెల కిషోర్‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నవేశాలు న‌వ్విస్తాయి. నాగ‌బాబు గోవిందం తండ్రిగా క‌నిపించారు. అయితే ఆయ‌న‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌డం కుద‌ర‌లేదు. గోపీసుంద‌ర్ సంగీతం బాగుంది. మెలోడీ ప్ర‌ధాన‌మైన స్వ‌రాల‌తో అల‌రించింది. ఇంకేం ఇంకేం కావాలి పాట హైలైట్‌గా నిలిచింది. మ‌ణికంద‌న్ కెమెరా ప‌నిత‌నం ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా బంధించింది. ముఖ్యంగా దేవాల‌యం నేప‌థ్మంలోని ప‌తాకఘ‌ట్టాల్లో ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. సాంకేతికంగా అన్ని అంశాలు బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా అనిపించాయి.

 

 

తీర్పు

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా చ‌క్క‌టి కామెడీ, సున్నిత‌మైన భావోద్వేగాలు, హృద‌యానికి హ‌త్తుకునే ప్ర‌ణ‌య స‌న్నివేశాల‌తో గీత గోవిందం అంద‌రిని అల‌రిస్తుంది. ఓ ఆహ్లాద‌భ‌రిత‌మైన ప్రేమ క‌థ‌ను చూశామ‌నే అనుభూతిని మిగులుస్తుంది. విజ‌య్‌దేవ‌ర‌కొండ కెరీర్‌లో మ‌రో పెద్ద హిట్‌గా గీత గోవిందం నిలిచిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

రేటింగ్‌: 3


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.