English | Telugu

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ రివ్యూ

on Sep 20, 2019

సినిమా: గద్దలకొండ గణేష్ (వాల్మీకి)
నటీనటులు: వరుణ్‌ తేజ్‌, అధర్వ మురళి, పూజా హెగ్డే, మృణాళిని రవి, సత్య, బ్రహ్మాజీ, శత్రు, డింపుల్ తదితరులు
బేనర్: 14 రీల్స్ ప్లస్
డైరెక్టర్: హరీశ్ శంకర్
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
సినిమాటోగ్రఫీ: అయనాంక బోస్‌
ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌
ఫైట్స్‌: వెంకట్‌
ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల
స్క్రీన్‌ ప్లే: మధు శ్రీనివాస్‌, మిథున్‌ చైతన్య
లైన్ ప్రొడ్యూసర్: హరీష్‌ కట్టా
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట
దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌
విడుదల తేదీ: 20 సెప్టెంబర్ 2019

'వాల్మీకి' అనే టైటిల్‌తో వరుణ్ తేజ్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. కారణం.. వరుణ్ తేజ్ రౌడీగా నెగటివ్ కేరెక్టర్‌లో కనిపించనున్నాడనే అంశం. కానీ 'వాల్మీకి' టైటిల్‌పై బోయ సామాజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లెక్కడంతో, కోర్టు నుంచి నోటీసులు రావడంతోనూ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు రావడంతోనూ గత్యంతరం లేని స్థితిలో విడుదలకు ఒక రోజు ముందు టైటిల్‌ను 'గద్దలకొండ గణేష్'గా మారుస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 'పేట' డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఐదేళ్ల క్రితం రూపొందించిన తమిళ హిట్ ఫిల్మ్ 'జిగర్తాండ'కు ఇది రీమేక్. అక్కడ బాబీ సింహా చేసిన కేరెక్టర్‌ను వరుణ్ చేస్తే, సిద్ధార్థ్ చేసిన పాత్రను తమిళ నటుడు అధర్వ చేశాడు. మరి గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ మెప్పించాడా? తమిళ మాతృకకు మార్పులు చేస్తూ హరీశ్ శంకర్ తీసిన సినిమా ఎలా ఉంది? చూద్దాం.

కథ:
ఇది గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) అనే కరడుకట్టిన రౌడీ షీటర్ కథ. నలుగురు చెప్పుకునేట్లు బతకాలనే అతడు, హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎదిరించినవాడిని కాళ్లూ చేతులు తీసేయడమో, తగలబెట్టడమో, తుపాకీతో కాల్చడమో, కత్తితో నరకడమో.. అతడు చేసే పని. తొలిసారి డైరెక్షన్ ఛాన్స్ సంపాదించిన అభిలాష్ (అధర్వ) అనే యువకుడు ఒక లైవ్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో సినిమా తియ్యాలనుకుంటాడు. గద్దలకొండ గణేష్ గురించి విని, అతడి కథ తెలుసుకోవాలని గద్దలకొండకు వస్తాడు. గణేష్ కథ తెలుసుకొనే యత్నంలో అనుమానాస్పదంగా అతనికి దొరికిపోతాడు. తన కథతో అతడు సినిమా తియ్యాలనే సంకల్పంతో ఉన్నాడని తెలియడంతో, తన పాత్రను తనే చేస్తానని పేచీ పెడతాడు గణేష్. అప్పుడు అభిలాష్ ఏం చేశాడు? ఈ మధ్యలో అభిలాష్ హృదయానికి చేరువైన బుజ్జమ్మ (మృణాళిని రవి)ను గణేష్ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిన పరిణామమేమిటి? గణేష్ జీవితంలో శ్రీదేవి (పూజా హెగ్డే) పాత్రేమిటి?.. అనేవి కథలోని కీలక అంశాలు.

అనాలిసిస్:

టైటిల్ కార్డ్‌లో 'మాటలు, మార్పులు, దర్శకత్వం: హరీశ్ శంకర్' అని వేసుకున్నాడు దర్శకుడు. ఆ మార్పుల్లో ప్రధానమైంది గద్దలకొండ గణేష్ అంత క్రూరుడిగా ఎలా మారాడనే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్‌లోనే మనకు శ్రీదేవి (పూజా హెగ్డే) పాత్ర వస్తుంది. శోభన్‌బాబు, శ్రీదేవి జంటగా నటించిన 'దేవత'లో వాళ్లిదరిపై తీసిన సూపర్ హిట్ సాంగ్ 'ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిల్లా పడ్డాదమ్మా' పాటను ఇందులో వరుణ్, పూజపై చిత్రీకరించారు. ఇద్దరూ అలనాటి తారల్ని మరపించలేకపోయినా, ముచ్చటగా చేశారు. అయితే ఈ ఎపిసోడ్‌ను కథలో బలవంతంగా చొప్పించినట్లు అనిపిస్తుంది. ఇది సెకండాఫ్‌లో వస్తుంది.

అంతకుముందు ప్రథమార్ధం మన అంచనాలకు భిన్నంగా నడిచి కొంత చికాకు కలిగిస్తుంది. గణేష్ క్యారెక్టరైజేషన్ కానీ, గద్దలకొండకు వచ్చిన అభి చేసే పనులు కానీ ఒక ఫ్లోలో ఉండవు. సన్నివేశాల మధ్య 'సంథింగ్' ఏదో మిస్సవుతున్నదనే ఫీల్ కలుగుతుంది. సన్నివేశాలు 'ఫోర్స్‌ఫుల్'గా వస్తుంటే, ఆ పాత్రలతో ఎలా మనం సహానుభూతి చెందుతాం? కథలో రెండు పాత్రలు కీలకం.. ఒకటి కథను నడిపించే అభి పాత్ర, రెండు.. కథకు నాయకుడైన గణేష్ పాత్ర. ఈ రెండు పాత్రల్లో దేనితోనూ మనం కనెక్ట్ కాలేం. సినిమాకి ఇదే మైనస్‌గా మారిందని చెప్పాలి.

కరడుకట్టిన రౌడీగా గణేష్ చేసే హత్యల వల్ల ఆ పాత్రను మనం ప్రేమించలేం. ఒక వైపు తన సినిమా కోసం గణేష్ కథను తెలుసుకుంటూ, మరోవైపు అతడికి సంబంధించిన వివరాల్ని జర్నలిస్టయిన తన బాబాయి (డైరెక్టర్ దేవీప్రసాద్)కి ఒక ఇన్‌ఫార్మర్ లెక్క అందిస్తున్న అభిని చూసి, అతడి పాత్రతోనూ సహానుభూతి చెందలేం.

శ్రీదేవిని అమితంగా ప్రేమించి, ఆమెకి దూరమైన గణేష్, ఒకే ఒక్క సీన్‌తో బుజ్జమ్మపై మనసు పారేసుకోవడం అతడి క్యారెక్టరైజేషన్‌ను దెబ్బకొట్టేసింది. ఇవన్నీ ఒకెత్తు.. గణేష్ హీరోగా అభి తీసిన 'సీటీమార్' సినిమా విడుదలయ్యాక అప్పటిదాకా అతడ్ని అసహించుకున్న, అతడంటే భయపడిన జనం అతడ్ని ఇష్టపడుతున్నట్లు, అభిమానిస్తున్నట్లు చూపించడం.. పెద్ద ఫార్స్! 'సీటీమార్' అనేది గణేష్ కథే. అంటే ఒక కిరాతకుడి కథ. అతి సులువుగా మనుషుల్ని చంపేసే క్రూరుడి పాత్రలో గణేష్‌ను చూసిన జనం ఎలా అతడ్ని హీరోగా అభిమానిస్తారు? అతడ్ని చూస్తేనే భయపడే ఒక పాప సినిమా చూసి, అదే రూపంతో ఉన్న గణేష్‌ను ముద్దు పెట్టుకోవడం ఇంప్రెసివ్‌గా లేదు.

ఇక హత్యానేరం నుంచి తప్పించుకోడానికి ప్రత్యక్ష సాక్షి అయిన తనను కొడుకు కోర్టులో మూగదాన్నిగా మార్చేయడంతో, అప్పట్నుంచి ఏళ్ల తరబడి కొడుకుతో మాట్లాడకుండా మూగదానిలాగే ఉండిపోయిన తల్లి, సినిమా చూసి, ఉద్వేగాన్ని ఆపుకోలేక, కొడుకును కావలించుకొని, "సినిమాలో ఎంత బాగున్నావ్ బిడ్డా" అని ముద్దుపెట్టుకోవడం నాటకీయంగా ఉంది కానీ, సహజంగా లేదు. "సినిమా అంటే ఒక గజల్.. ఒక పజిల్.. ఒక విజిల్" అంటూ సినిమాని ఆకాశమంత ఎత్తులో నిలపాలనే ఉద్దేశంతో క్లైమాక్స్‌ను మలిచాడు దర్శకుడు. ఈ సందర్భంగా ఆయా పాత్రలతో చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి కానీ, సన్నివేశపరంగా మనసులో ముద్ర వేసే రీతిలో లేవు.

చివరి దాకా, మనది కాని కథను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందంటే.. దర్శకుడు చేసిన మార్పులు సినిమాకి బలం చేకూర్చకపోగా, బలహీనపర్చాయని అనుకోవాలి. మిక్కీ జె. మేయర్ సంగీతం బాగుంది. చాలా సన్నివేశాలు అతడి బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే బాగున్నట్లనిపిస్తాయి. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో ఉంది. సన్నివేశాల చిత్రీకరణలో అతడు వాడిన కలర్ టోన్ ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్:

వరుణ్ తేజ్ నటన
సినిమాటోగ్రఫీ, సంగీతం
డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

సహానుభూతి కలిగించని ప్రధాన పాత్రలు
ఫోర్స్‌ఫుల్‌గా సాగిన కథనం
ఎమోషన్ క్యారీ చెయ్యలేకపోవడం
క్లైమాక్స్ అర్థవంతంగా లేకపోవడం

తారల అభినయం:

గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ ప్రశంసనీయమైన అభినయం ప్రదర్శించాడు. కెరీర్‌లో తొలిసారి వచ్చిన నెగటివ్ రోల్‌ను, అదీ క్రూరంగా కనిపించే రోల్‌ను ప్రతిభావంతంగా చేశాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బెల్‌బాటం ప్యాంట్లు వేసుకొని 1980లలోని హీరోలను గుర్తు చేశాడు. సినిమాలో అతడి పాత్ర ముందు మిగతా పాత్రలన్నే చిన్నబోయాయి కాబట్టి 'గద్దలకొండ గణేష్' కచ్చితంగా వరుణ్ తేజ్ సినిమానే. గణేష్ పాత్ర తర్వాత ముఖ్యమైంది, ఈ కథకు సూత్రధారి అయిన అభిలాష్. ఆ పాత్రలో అధర్వ చక్కగా ఇమిడిపోయాడు. సాఫ్ట్‌గా కనిపిస్తూ, అవసరమైనప్పుడు గుండె నిబ్బరాన్ని ప్రదర్శించే పాత్రలో అతడు రాణించాడు. అతడి జోడీగా బుజ్జమ్మ పాత్రలో మృణాళిని రవి ఆకట్టుకుంది. తెలుగులో ఇది ఆమె పరిచయం చిత్రం. ఆ ఫ్రెష్‌నెస్‌ను ఆమె అందించింది. శ్రీదేవిగా చిన్న పాత్రే అయినా పూజా హెగ్డే అదరగొట్టింది. ఆ పేరు పెట్టినందుకు సౌందర్యరాశిగా మెరిసింది. ఆ పాత్ర ఇంకాసేపు ఉండే బాగుంటుందనిపించిందంటే.. సినిమాలో ఆమె వేసిన ముద్ర అటువంటిది. గణేష్ ప్రధాన అనుచరుడిగా శత్రు తనకు అలవాటైన పాత్రను ఈజీగా చేశాడు. అభి ఫ్రెండ్‌గా సత్య కాస్త నవ్వించాడు. నిజానికి సినిమాలో రిలీఫ్ పాయింట్ అతడే. కానీ 'లౌడ్ వాయిస్'తో ఓవరాక్టింగ్ చేసి అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టాడు కూడా. నట గురువుగా బ్రహ్మాజీ ఆశ్చర్యకరమైన పాత్రలో కనిపించాడు. అతడి హావభావాలు అలరించాయి.
సుబ్బరాజు, ప్రభాస్ శీను, రచ్చ రవి, అన్నపూర్ణ వంటివాళ్లు పాతోచితంగా నటించారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

అక్కడక్కడా మెరుపులు, డైలాగ్స్ చమక్కులతో ఆకట్టుకుంటూనే మనసుకు కనెక్ట్ కాని సినిమా 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి). నటుడిగా వరుణ్ తేజ్‌కు పేరు తెచ్చే సినిమా. డైరెక్టర్‌గా హరీశ్ శంకర్‌కు పనికొచ్చే సినిమా కాదు. మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని చేసిన సినిమా కాబట్టి వాళ్ల ఆదరణ మీదే ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.

రేటింగ్: 2.75/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here