ఓ మాదిరి సినిమాల మధ్య ఈ వారం భీకర పోరు
on Dec 5, 2019
డిసెంబర్ 6న ఓ మాదిరి సినిమాల మధ్య భీకర పోరు నెలకొంది. గంపగుత్తగా ఓ మాదిరి సినిమాలు అన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.మీకు తెలుసా? ఈ శుక్రవారం ఏకంగా ఆరుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
'ఆర్ఎక్స్ 100' టు '90ఎంఎల్'
'ఆర్ఎక్స్ 100'తో ఒక్కసారిగా తెలుగు సినిమా ప్రముఖులను, ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్న హీరో కార్తికేయ. 'ఆర్ఎక్స్ 100' తర్వాత, ఆ సినిమా నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణంలో, కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో కార్తికేయ నటించిన సినిమా '90ఎంఎల్'. ప్రతిరోజూ 90ఎంఎల్ మందు తాగకపోతే బతకలేని ఓ యువకుడి కథ. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. ఆల్రెడీ రిలీజైన ప్రోమోలు, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. 'ఇది లిక్కర్ తో నడిచే బండి', 'దేవదాసు లాంటి డ్రింకర్ పుట్టాలని కోరుకోవడం ఏంటి?', 'పూటకు డాక్టర్ 90ఎంఎల్ తాగమన్నాడు' వంటి డైలాగులు జనాలను ఆకట్టుకున్నాయి. ఈ శుక్రవారమే ఈ సినిమా విడుదలవుతోంది.
భాగ్యనగర వీధుల్లో... దర్శకనిర్మాతగా కమెడియన్
ఇన్నాళ్లూ హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన శ్రీనివాసరెడ్డి, ఈ శుక్రవారం దర్శకుడిగా నవ్వించడానికి సిద్ధమయ్యాడు. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకోవడానికి రామ్ గోపాల్ వర్మ ఆటిట్యూడ్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ 'వెన్నెల' కిషోర్ బయలుదేరతాడు. అతడికి శ్రీనివాసరెడ్డి, 'స్వామిరారా' సత్య, 'షకలక' శంకర్ ఎలా దొరికారు? డ్రగ్స్ తో సంబంధం లేకుండా ఎలా చిక్కారు? అనేది కథ. సోషల్ మీడియా;లో వైరల్ అయిన కంటెంట్ ను స్పూఫ్ చేస్తూ తీశారు.
పవన్ 'తొలిప్రేమ'లో పాట రీమిక్స్... మిస్ మ్యాచ్
ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటించిన తాజా తెలుగు సినిమా 'మిస్ మ్యాచ్'. 'ఆటగదరా శివ' ఫేమ్ ఉదయ్ శంకర్ హీరో. ఓ ఐటీ ఉద్యోగి, మల్లయోధురాలు అయిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అబ్బాయి వేటిజేరియన్. అమ్మాయి నాన్ వెజిటేరియన్. వీరిద్దరి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి? తర్వాత ఏమైంది? అనేది కథ. పవన్ కల్యాణ్ క్లాసిక్ సినిమా 'తొలిప్రేమ'లో 'ఈ మనసే... సే... సే' పాటను రీమిక్స్ చేశారు. ఆ పాట మీదే ప్రమోషన్ చేస్తున్నారు.
ఈ మూడు సినిమాలతో పాటు 'కలియుగ', 'అశ్వమేథం' సినిమాలు కూడా 6న విడుదల అవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తోడల్లుడు అశోక్ నిర్మించిన 'మథనం' చిత్రాన్ని కేవలం అమెరికాలో 6న విడుదల చేస్తున్నారు. అక్కడ ఫలితాన్ని బట్టి ఇండియాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.