English | Telugu

ఎఫ్2 మూవీ రివ్యూ

on Jan 12, 2019


నటీనటులు: వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, ఝాన్సీ, మాధవి తదితరులు...
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కెమెరా: సమీర్ రెడ్డి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత‌లు: శిరీష్, లక్ష్మణ్
సమర్పణ: దిల్ రాజు
కథ, మాటలు, ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: జనవరి 12, 2018

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. 'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన అనిల్ రావిపూడి దర్శకుడు కావడం... టీజర్, ట్రయిలర్లు ప్రామిసింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై నమ్మకం కలిగింది. 'ఎఫ్2' ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా? లేదా?

క‌థ‌:

వెంకీ (వెంక‌టేష్‌) ఓ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏ. అత‌డికి హారిక (త‌మ‌న్నా)తో పెళ్ళి జ‌రుగుతుంది. త‌ర్వాత ఇంట్లో ప్ర‌తిదీ తాము చెప్పినట్టు జ‌ర‌గాల‌ని హారిక‌, హారిక త‌ల్లి ప్ర‌వ‌ర్తిస్తుంటారు. దాంతో వెంకీకి ఫ్ర‌స్ట్రేష‌న్ వ‌స్తుంటుంది. ఇంత‌లో హారిక చెల్లెలు హ‌నీ (మెహ‌రీన్‌)ని హైద‌రాబాదీ కుర్రాడు వ‌రుణ్ యాద‌వ్ (వ‌రుణ్‌తేజ్‌) ప్రేమిస్తున్నాడ‌ని అతడికి తెలుస్తుంది. వరుణ్ పెళ్ళికి సిద్ధపడితే వెంకీ వద్దని చెబుతాడు. కానీ, వ‌రుణ్ అతడి మాటలు విన‌కుండా పెళ్ళికి సిద్ధపడతాడు. నిశితార్థం జరుగుతుంది. నిశితార్థం తరవాత పెళ్ళి పనుల్లో హానీ అండ్ ఫ్యామిలీ ప్రవర్తనతో వరుణ్‌కి కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వెంకీ పక్కింట్లో వుండే పెద్ద‌మ‌నిషి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఇచ్చిన స‌ల‌హాతో.. ముగ్గురూ కలిసి యూర‌ప్ వెళ‌తారు. ఇది తెలిసిన హారిక‌, హ‌నీ కూడా యూర‌ప్ వెళ‌తారు. అక్క‌డ ఏం జ‌రిగింది? న‌లుగురూ ప్ర‌కాశ్‌రాజ్ ఇంట్లో ఎందుకు చేరారు? తమ మధ్య ఏర్పడిన చిక్కుముడుల‌ను ఎలా చ‌క్క‌బెట్టుకున్నారు? అనేది మిగ‌తా సినిమా!

విశ్లేషణ:

దర్శకుడు అనిల్ రావిపూడి కథ కంటే కామెడీపై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్టాఫ్ వరకూ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. కథ కొంచెం ముందుకు కదలకపోయినా... కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ కథ యూరప్‌కి వెళ్లిన తరవాత ఏం చేయాలో పాలుపోయినట్టు లేదు. శ్రీనువైట్ల మార్క్ ఫార్ములాలోకి కథను తీసుకువెళ్లాడు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్... నలుగురూ ఓ ఇంట్లో చేరిన తరవాత అదే కామెడీ అంతగా వర్కవుట్ కాలేదు. కొన్ని సన్నివేశాలు మాత్రమే పర్వాలేదనిపిస్తాయి. హీరోలు వర్సెస్ హీరోయిన్లు... కాన్సెప్ట్ సన్నివేశాలు మరింత బాగా రాసుకోవలసింది.

ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి... భార్యాబాధితుల చేత చప్పట్లు కొట్టించేలా పలు సన్నివేశాలు రాశాడు. వెంకీకి రాసిన పంచ్ డైలాగ్స్ బావున్నాయి. నలుగురు డామినేటింగ్ లేడీస్ మధ్య ఓ మగాడు ఎలా కొట్టుమిట్టాడుతాడనే సన్నివేశాలు బావున్నాయి. పెళ్లైన మగవాళ్ళు, కొత్తగా పెళ్లైన వాళ్ళు ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో ఎక్కడో చోట తమను తాము చూసుకుంటారు. అనిల్ కథ సినిమాటోగ్రఫీ, ఉన్నత నిర్మాణ విలువలు తోడయ్యాయి. దేవిశ్రీ పాటల్లో, నేపథ్య సంగీతంలో మెరుపులు లేవు. జస్ట్ ఏవరేజ్ సాంగ్స్ ఇచ్చాడు.

ప్లస్ పాయింట్స్:

వెంకటేష్ - వరుణ్ తేజ్ బ్రోమాన్స్
సందర్భానుసారంగా వచ్చే కామెడీ
పంచ్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

బలహీనమైన కథ
ట్విస్టులు వర్కవుట్ కాలేదు
క్లైమాక్స్..  మ్యూజిక్ కూడా!

నటీనటుల పనితీరు:

'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' తరహాలో వెంకటేష్ మరోసారి నవ్వించాడు. ఫ్యామిలీ కథల్లో  వెంకీ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బావుంటాయి. మరోసారి అటువంటి టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెంకీ వంటి సీనియర్‌తో నటించడం, కామెడీ టైమింగ్‌తో మ్యాచ్ కావడం అంటే వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోకి అంత సులభం కాదు. అయితే... వెంకీ యాక్టింగ్‌తో, టైమింగ్‌తో మ్యాచ్ అయ్యేలా వరుణ్ తేజ్ నటించాడు. పాత్ర పరిధిలో బాగా చేశాడు. సినిమాలో ఇద్దరి మధ్య బ్రోమాన్స్ బావుంది. అయితే.. వరుణ్ కంటే వెంకీకి ఎక్కువ స్కోప్ దక్కింది. తమన్నా నటన ఓకే. మెహరీన్ ఎప్పటిలా లిప్ సింక్ లేకుండా, ఎక్స్‌ప్రెష‌న్స్ లేకుండా ఏదో నటించేశారు. పాటల్లో హీరోయిన్లు ఇద్దరూ బట్టల విషయంలో పొదుపు పాటించారు. ఓ సన్నివేశంలో బికినీ కూడా వేశారు. (ఫ్యామిలీ సినిమాలో ఈ అందాల ఆరబోత ఏంటని కొంతమంది ప్రేక్షకులు ప్రశ్నిస్తారనే సందేహం దర్శకుడికి వచ్చినట్టుంది. సినిమా స్టార్టింగులో ఓ సన్నివేశంలో హీరోయిన్ తమన్నా చేత 'కంఫర్ట్ డ్రస్' అని డైలాగ్ చెప్పించారు). మిగతా ఆర్టిస్టుల్లో కమెడియన్ ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. 'వెన్నెల' కిషోర్ క్యారెక్టర్ క్లిక్ కాలేదు. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరుల పాత్రలు కొత్తగా ఏమీ లేవు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అన్నపూర్ణమ్మ, వై. విజయ నటన, డైలాగులు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ పాత్ర పేలింది.

చివరగా:
 ప్రేక్షకులను నవ్వించడమే పరమావధిగా తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్ ఫిల్మ్. ఫస్టాఫ్ వరకూ కథతో సంబంధం లేకుండా ఎటువంటి జర్కులు లేకుండా ప్రేక్షకులను బాగానే నవ్వించారు. సినిమా సాఫీగా ముందుకు కదిలింది. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక బండి కాస్త నెమ్మదించింది. ఓవ‌రాల్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో మ్యాగ్జిమమ్ సక్సెస్ అయ్యారు. ప్రచార చిత్రాల్లో చెప్పినట్టు పండక్కి నవ్వించేట్టున్నారు.

రేటింగ్: 3.5/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here