బొమ్మ హిట్టు.. కారు గిఫ్టు!
on Jul 8, 2020
సినిమా ఇండస్ట్రీలో హిట్లు అందుకున్న హీరోలు, నిర్మాతలు తమ ఆనందాన్ని పంచుకోడానికి ఆ సినిమా ఎవరివల్ల హిట్టయ్యిందో వారికి కానుకలు అందజేయడం ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కొంతమంది ఫ్లాట్స్‌ను కానుకగా అందిస్తే, ఇంకొంతమంది ఖరీదైన వాచ్‌లు, లైటర్లు, ఆర్నమెంట్స్ కానుకలుగా ఇస్తుంటారు. ఖరీదైన కార్లను గిఫ్టులుగా ఇచ్చేవాళ్లూ ఉన్నారు. అలా ఎవరి నుంచి ఎవరు కారును కానుకగా అందుకున్నారంటే...
1. 'శ్రీమంతుడు' ఇచ్చిన కానుక
మహేశ్ కెరీర్లో 'శ్రీమంతుడు' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆ సినిమాతో కెరీర్ పరంగానూ శ్రీమంతుడు అయ్యాడు మహేశ్. అప్పటికి అతని సినిమాల్లోకెల్లా హయ్యెస్ట్ గ్రాసర్ ఆ సినిమాయే. అందుకే ఆ కృతజ్ఞతతో తన డైరెక్టర్ కొరటాలకు ఆడి 6 కారును కానుకగా ఇచ్చాడు.
2. నిర్మాతల కొంగు బంగారం
భారీ సినిమాలను పక్కనపెడితే చిన్న, మధ్యస్థాయి సినిమాలతోటే సూపర్ హిట్లు అందించడం డైరెక్టర్ మారుతి స్పెషాలిటీ. అదే తరహాలో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా అతను రూపొందించిన 'ప్రతిరోజూ పండగే' బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ ఆనందంలో మారుతికి నిర్మాతలు రేంజ్ రోవర్ వెలార్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి మరింత సంతోషపెట్టారు.
3. 'గీతాంజలి'కి బిగ్ గిఫ్ట్
సినిమా విడుదల కాకముందే, దాని మీద నమ్మకంతో హీరోయిన్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన ఘనత ఆ సినిమా నిర్మాత కోన వెంకట్‌దే. ఆ సినిమా 'గీతాంజలి' అయితే ఆ హీరోయిన్ అంజలి. ఆ సినిమా విడుదలకు ముందే అంజలికి బీఎండబ్బ్యు కారును కానుకగా అందజేశాడు కోన వెంకట్.
4. స్నేహబంధానికి గుర్తు
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మధ్య బంధం గురించి ఇండస్ట్రీలోని అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరి కలయికలో వచ్చిన 'అత్తారింటికి దారేది' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా వచ్చిన కొంత కాలానికి త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా అతనికి స్కోడా కారును పవన్ కల్యాణ్ ప్రెజెంట్ చేశారు.
5. దటీజ్ సల్లూ భాయ్!
తోటి నటులకు, సాంకేతిక నిపుణులకు తరచూ బహుమతులు ఇవ్వడంలో ముందుంటాడు సల్మాన్ ఖాన్. ప్రభుదేవా డైరెక్షన్లో ఆయన చేసిన 'దబాంగ్ 3' సినిమాలో ఈగ పేమ్ సుదీప్ విలన్‌గా నటించాడు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత కొత్త బీఎండబ్ల్యూ ఎం5 కారులో బెంగళూరులోని సుదీప్ ఇంటికి వెళ్లి, ఆ కారును బహుమతిగా ఇచ్చి వచ్చాడు.
6. 'దేవి'తో వచ్చిన సంబంరం
ప్రతిభావంతుడైన డైరెక్టర్‌గా పేరుపొందిన ఎ.ఎల్. విజయ్ కొంత కాలం క్రితం కెరీర్లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొన్నాడు. ప్రభుదేవాతో చేసిన 'దేవి' పెద్ద హిట్టవడంతో ఆనందంలో ఉన్న అతడిని నిర్మాత గణేశ్‌తో కలిసి ఆడి కారును కానుకగా ఇచ్చి మరింత ఆనందాన్నిచ్చాడు ప్రభుదేవా.
7. సూర్య అంటే అంతే!
నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ యాక్టర్ సూర్య ఓ సినిమా చేశాడు. అది తెలుగులో 'గ్యాంగ్' పేరుతో రిలీజయ్యింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఆ సినిమా బాగానే ఆడింది. యంగ్ డైరెక్టర్‌ను ఎంకరేజ్ చెయ్యాలనే ఉద్దేశంతో టయోటా ఇన్నోవా క్రిస్టా కారును విఘ్నేష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు సూర్య.