సుశాంత్‌సింగ్ ఆత్మహత్య వెనుక డి గ్యాంగ్?
on Jul 13, 2020
బాలీవుడ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరి స్తంభించిపోయి సుశాంత్‌సింగ్ చనిపోయాడని పోలీసులు ధ్రువీకరించగా, పలువురు పొలిటీషియన్లు దాన్ని హత్యగా అభివర్ణిస్తూ సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ రా ఆఫీసర్ ఎన్.కె. సూద్ వాదన మరో రకంగా ఉంది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సుశాంత్‌ను హత్య చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
సుశాంత్‌సింగ్‌ను ఫోన్లో దావూద్ గ్యాంగ్ బెదిరించిందని ఆయన చెప్పారు. అయితే దీనికి ఆయన ఎలాంటి ఆధారాలూ చూపలేదు. ఆ గ్యాంగ్ బెదిరింపుల వల్లే సుశాంత్ మానసిక రుగ్మతకు గురయ్యాడనేది ఆయన వాదన. ఒక ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ హత్యలో సుశాంత్ సన్నిహితుల హస్తం కూడా ఉందనేది ఆయన ఆరోపణ. సుశాంత్ మరణానికి సరిగ్గా ఒకరోజు ముందే సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా పోవడం.. దీన్ని ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన హత్యగా తెలియజేస్తోందనేది కూడా ఆయన వాదనలో భాగం. దావూద్ గ్యాంగ్ బెదిరింపుల నుంచి తప్పించుకోడానికి సుశాంత్ 50 సార్లు ఫోన్ నంబర్లు మార్చాడనీ, కారులోనే పడుకొనేవాడనీ కూడా సూద్ వాదిస్తున్నారు.