English | Telugu

'కామ కథలు' కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు!

on Nov 16, 2019

 

నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' (కామ కథలు) వెబ్ సిరీస్ రసిక జనుల్ని విపరీతంగా అలరించాయి. మనుషుల్లో సహజంగా నిద్రాణమై ఉండే లైంగిక వాంఛల్ని ఎత్తి చూపుతూ రూపొందిన ఆ సిరీస్‌లో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్ వంటి పేరుపొందిన బాలీవుడ్ మెయిన్ స్ట్రీం తారలు నటించారు. అంతేనా.. నాలుగు సెగ్మెంట్లుగా వచ్చిన స్టోరీస్‌ని కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అఖ్తర్, దిబాకర్ బెనర్జీ వంటి పేరుపొందిన డైరెక్టర్లు రూపొందించారు. ఇప్పుడు ఆ 'కామ కథలు' తెలుగులో వస్తున్నాయి. అయితే ఇవి 'లస్ట్ స్టోరీస్'కు రీమేక్ కాదనీ, 'ఫ్రెష్' స్టోరీలతో ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నామనీ, వాటిలో ఒక సెగ్మెంట్‌ను డైరెక్ట్ చేస్తోన్న నందినీరెడ్డి తెలిపారు. 

ఆమె డైరెక్ట్ చేస్తున్న కామ కథల్లో జగపతిబాబు, అమలా పాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య స్టీమీ సీన్లు ఉంటాయా, ఉండవా.. అనే విషయం మరి కొద్ది రోజుల్లో వెల్లడైపోతుంది. ఈ సిరీస్ చేయడానికి ముందు 'ఆడై' అనే తమిళ సినిమా చేసింది అమలా పాల్. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ మూవీ రిలీజైంది. అందులో ఒక సన్నివేశాన్ని న్యూడ్‌గా చేసి సంచలనం సృష్టించింది అమల. సన్నివేశం డిమాండ్ చేస్తే బోల్డ్‌గా నటించడానికి రెడీగా ఉంటానని ఆమె తేల్చి చెప్పింది. బహుశా అందుకేనేమో.. 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కోసం సంప్రదించగానే ఆమె అంగీకరించింది.

మొత్తం నాలుగు సెగ్మెంట్లుగా ఉండే ఈ సిరీస్‌లో ఒక దానికి తరుణ్ భాస్కర్, ఇంకో దానికి 'ఘాజీ' ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సంకల్ప్ డైరెక్ట్ చేస్తున్న సెగ్మెంటులో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొంటోంది కూడా. ఇటీవల సెట్స్‌పై షూట్‌కు సంబంధించిన క్లాప్‌బోర్డును పట్టుకొని కెమెరాకు పోజిచ్చిన ఫొటోను ఈషా పోస్ట్ చేసింది. ఇప్పటి దాకా తను చేసిన సినిమాలతో గాళ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ పొందిన ఆమె.. తొలిసారి ఈ వెబ్ సిరీస్ కోసం బోల్డ్‌గా నటిస్తుండటం విశేషం. ఈ కామ కథల్లో ఆమె పాత్ర ఎలా ఉంటుంది, ఎలాంటి సీన్లు చేసిందనే విషయాలపై ఆమె అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆమె సెగ్మెంట్ స్ట్రీమింగ్ అయ్యాక, ఈషాకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుందో చూడాలి.

నాలుగో సెగ్మెంటును ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. నిజానికి 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా ఆ సెగ్మెంటును రూపొందించాల్సి ఉంది. మొదట తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. కానీ తెలీని కారణాలతో అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలోకి ఇంతవరకూ ఏ డైరెక్టరూ రాలేదు. 'లస్ట్ స్టోరీస్' హిందీ వెర్షన్‌ను ప్రొడ్యూస్ చేసిన ఆర్ఎస్‌వీపీ.. తెలుగు స్టోరీస్‌ను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ కామ కథలు తెలుగు వీక్షకుల్ని ఏ మేరకు అలరిస్తాయో చూడాలి.

ఇంకో విషయం ఏమంటే.. వెబ్ సిరీస్‌లకు క్రమేణా ఆదరణ పెరుగుతుండటంతో, మెయిన్ స్ట్రీం ఫిల్మ్ యాక్టర్లు వాటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 'గూఢచారి' మూవీలో అడివి శేష్ జోడీగా కనిపించి మెప్పించిన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ్ల హిందీ వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ హెవెన్'లో బోల్డ్‌గా నటించి, వీక్షకుల మతులు పోగొట్టింది. అదే సమయంలో ఆమె పర్ఫార్మెన్సుకూ ప్రశంసలు లభించాయి. 'దేశముదురు'తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై, ఇవాళ తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులకు సన్నిహితమైన హన్సిక సైతం లేటెస్టుగా ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. 'భాగమతి' డైరెక్టర్ అశోక్ రూపొందిస్తున్న ఆ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది కూడా. ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీతో ఈ సిరీస్‌ను అశోక్ తీస్తున్నాడు. ఇలా.. సినీ తారలు ఒక్కొక్కరుగా వెబ్ సిరీస్‌పై ఆసక్తి చూపుతుండటంతో రానున్న రోజుల్లో అవి మరింత పాపులర్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Cinema GalleriesLatest News


Video-Gossips