డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య స్థితి ఆందోళనకరం?
on Oct 21, 2020
సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారినట్లు ఆయన కుమార్తె శివాత్మిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా గురువారం ఉదయం షేర్ చేసిన నోట్‌తో తెలుస్తోంది. "కొవిడ్‌తో నాన్న గట్టిగా పోరాడుతున్నప్పటికీ, ఆ పోరాటం క్లిష్టంగా మారింది. మీ ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలే మమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయనీ, మమ్మల్ని ముందుకు వెళ్లేలా చేస్తాయని మేం నమ్ముతున్నాం. నాన్న వేగిరంగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా మీ అందరినీ అడుగుతున్నాను. మీ ప్రేమతో ఆయన దీన్నుంచి దృఢంగా బయటకు వస్తారు" అని శివాత్మిక ట్విట్టర్లో షేర్ చేసింది.
ఆమె ట్వీట్‌తో రాజశేఖర్ అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాము కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు గురైనట్లుగా రాజశేఖర్ ఈ నెల 17న వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనీ, అయితే తమ పిల్లలు ఇప్పటికే దాన్నుంచి పూర్తిగా బయటపడ్డారని తెలిపిన ఆయన, భార్య జీవిత, తను హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే దీన్నుంచి బయటపడి ఇంటికి వస్తామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఇప్పుడు శివాత్మిక షేర్ చేసిన ట్వీట్‌తో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవలేదని, మరింత క్షీణించిందనీ అర్థమవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో మనముందుకు రావాలని బలంగా కోరుకుందాం.
Also Read