రవితేజ డిగ్రీ మధ్యలోనే వదిలేశాడని తెలుసా?
on Jan 26, 2021
'క్రాక్' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు రవితేజ. జనవరి 26 అతడి బర్త్‌డే. అంటే ఈ బర్త్‌డేకి ఓ మంచి గిఫ్ట్ అతడికి లభించిందన్న మాట. చాలామందికి సినిమాల్లోకి రాకముందు అతడి గురించి తెలీదు. రవితేజ పుట్టింది వాళ్లమ్మమ్మ ఊరు జగ్గంపేటలో. అతడికి ఆర్నెల్ల వయసులో వాళ్ల ఫ్యామిలీ బొంబాయికి వెళ్లిపోయింది. రవితేజ వాళ్ల నాన్న ఫార్మసిస్ట్‌గా జాబ్ చేసేవారు. ఆయనకు మంచి ఆఫర్ రావడంతో ఫ్యామిలీని అక్కడకు షిఫ్ట్ చేశారు. రవితేజ స్కూలు రోజులన్నీ నార్త్ ఇండియాలోనే గడిచాయి. ఇంట్లో మిగతా వాళ్లంతా ఎక్కువగా హిందీ మాట్లాడుకొంటూ ఉంటే, అమ్మానాన్నలు మాత్రం తెలుగులోనే మాట్లాడుకొనేవాళ్లు. ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్లున్న కాలనీ మొత్తం మీద సౌత్ ఇండియా ఫ్యామిలీ వాళ్లదొక్కటే. రవి ఎక్కువగా నార్త్ వాళ్ల ఇళ్లల్లోనే ఎక్కువగా గడుపుతూ వచ్చాడు.
విజయవాడలో కాలేజీలో చేరాడు. బీకామ్ తీసుకున్నాడు. తొమ్మిదేళ్ల వయసులోనే అతడికి సినిమా పిచ్చి మొదలైంది. హిందీ సినిమాలు తెగ చూసేవాడు. విజయవాడకు వచ్చాకే తెలుగు సినిమాలు చూస్తూ వచ్చాడు. రవితేజ వాళ్ల పిన్నివాళ్లు హైదరాబాద్‌లో ఉంటారు. అందుకని సమ్మర్ వెకేషన్లో వాళ్లింటికి వచ్చేవాడు. అప్పుడు సనత్‌నగర్‌లోని స్వామి టాకీస్‌లో తెలుగు సినిమాలు చూసేవాడు.
కొడుక్కి సినీ ఫీల్డ్‌లోకి వెళ్లాలని ఉందనే విషయం తెలిసినప్పుడు, కనీసం డిగ్రీ పూర్తి చెయ్యమని సలహా ఇచ్చాడు వాళ్ల నాన్న. డిగ్రీ, నేనా.. ఏమన్నా సంబంధం ఉందా?.. అనుకున్నాడు రవి. వాళ్ల ఫ్యామిలీలో సినిమా పిచ్చి అనేది ఎవరికీ లేదు, అతడికి తప్ప. అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందరికీ డిగ్రీలున్నాయి, అతడికి తప్ప. బీకామ్ డిస్కంటిన్యూ చేశాడు మరి! యాక్టింగ్ చెయ్యాలనీ, డైరెక్షన్ చెయ్యాలనీ.. రెండు రకాలుగా అతడికి కోరిక ఉంది.
మొదట కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. అతడి ఫేస్ ఎవరికీ నచ్చక మంచి వేషాలు రాలేదు. అయితే అతనెప్పుడూ డిస్కరేజ్ కాలేదు. ఎప్పుడూ ఫ్రస్ట్రేట్ అవడం కానీ, డిప్రెస్ అవడం కానీ లేదు. తన ప్రయత్నం తను చెయ్యాలనుకొనేవాడు. నెవర్ గివ్ అప్ అనేది అతడు నమ్ముకున్న సిద్ధాంతం. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో కన్నడ 'అంకుశం' సినిమా కోసం తొలిసారి కెమెరా ముందు నటించాడు రవితేజ. అతని కజిన్స్లో ఇద్దరు ఆ సినిమా నిర్మాణ భాగస్వాములు. ఆ సినిమాలోని స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ చేశాడు రవి. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను రాధాకృష్ణ అనే అతను చేశాడు.