అల... సుశాంత్ సీన్లు లేపేశారు!
on Jul 13, 2020
ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుశాంత్ నటించిన వినోదాత్మక సన్నివేశాలు కొన్నిటిని దర్శకుడు త్రివిక్రమ్ సినిమా ఫైనల్ కాపీలో తీసేశారు. అవును... ఇది నిజం. స్వయంగా సుశాంత్ చెప్పాడు. 'అల వైకుంఠపురము'లో తాను నటించిన కొన్ని ఫన్నీ సీన్స్ ఫైనల్ ఎడిట్ లో లేవని అతడు స్పష్టం చేశాడు. తాను నటించిన సీన్స్ ఉండటం కంటే సినిమా లెంగ్త్ కూడా ఇంపార్టెంట్ అని సుశాంత్ అన్నాడు. లెంగ్త్ ఎక్కువ అవుతుందని సుశాంత్ సీన్లు త్రివిక్రమ్ లేపేశారన్నమాట. అవి యుట్యూబ్ లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు చూసే ఛాన్స్ దక్కుతుంది.
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అల... వైకుంఠపురము' సినిమాలో జయరామ్, టబు కుమారుడిగా (అసలు కొడుకు అల్లు అర్జున్ అనుకోండి. మురళీ శర్మ కొడుకు సుశాంత్. అయితే, మురళీ శర్మ ఆసుపత్రిలో బిడ్డలను మారుస్తాడు) కీలక పాత్రలో సుశాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఉన్నంతలో అతడు బాగా చేశాడు. 'రాములో రాములా' పాటలో నాగస్వరం స్టెప్ తనకంటే సుశాంత్ బాగా చేశాడని అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యాక అందులో సుశాంత్ రెండు సిగరెట్స్ కాలుస్తూ, మందు కొట్టే సీన్ యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. అలా మిగతావి ఎప్పుడు రిలీజ్ చేస్తారో?