చెత్త సినిమా తీసి థియేటర్లు అడిగితే ఎలా?: తేజ
on May 14, 2019
"చిన్నా పెద్దా కాదు... మంచి సినిమాలకు థియేటర్లు ఇవ్వమని అందరూ అడగాలి. ఇస్తే మంచి సినిమా బతుకుతుంది. చెత్త సినిమా తీసి చిన్న సినిమాకు థియేటర్లు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు? అక్కడ కరెంట్ ఖర్చులు రావు" అని దర్శకుడు తేజ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నలుగురు నిర్మాతలు థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా చిత్ర పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని కొందరు వీలు చిక్కిన ప్రతిసారి ఆరోపణలు చేస్తుంటారు. తేజకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురైంది. ఆయన థియేటర్ బిజినెస్ గురించి స్పష్టంగా వివరించారు.
"థియేటర్ బిజినెస్ లాస్ బిజినెస్. నా థియేటర్ కోట్లు విలువ చేస్తుంది. కానీ, ఇప్పటివరకూ థియేటర్ రెంట్ మీద వచ్చిన డబ్బులతో మా పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనలేదు. పార్కింగ్, క్యాంటీన్ వల్లే థియేటర్ నడుస్తుంది. థియేటర్లో రూపాయి రాదు. అందరూ చిన్న సినిమాకు థియేటర్లు ఇవ్వమని అంటారు. చెత్త సినిమా తీస్తే ఎందుకు ఇస్తారు? కరెంట్ ఖర్చులు రావు. నెలకు థియేటర్ కరెంట్ ఖర్చు మూడు లక్షలు అవుతుంది. చిన్న సినిమాకు వారానికి ఆరు వేల రూపాయల వసూళ్లు ఉంటాయి. వారానికి 70 వేలు కలెక్ట్ చేస్తే గానీ కరెంట్ బిల్ కట్టలేం. కరెంట్ బిల్లుకు మైంటెనెన్సు, క్లీనింగ్ వంటివి అదనం. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనివాళ్లు థియేటర్లు ఇవ్వలేదని గోల చేస్తారు. పిచ్చి సినిమా తీసేసి చిన్న సినిమాకు థియేటర్ ఇవ్వలేదని అంటే ఎలా?" అని తేజ అన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో తేజ మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితానికి తాను న్యాయం చేయలేనని సినిమా నుంచి తప్పుకున్నట్టు వివరించారు. సినిమా ప్రారంభోత్సవం జరిగిన తరవాత కథలో లోతు తనకు అర్థమైందని అన్నారు. బాలకృష్ణతో తేజకు గొడవలు, అభిప్రాయ బేధాలు అని వచ్చిన వార్తలను ఖండించారు. తానింకా ఎన్టీఆర్ బయోపిక్ చూడలేదని తేజ అన్నారు. బయోపిక్ చేయకపోవడం వల్ల తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. "చాలామంది మీరు తీసి ఉంటే బయోపిక్ బాగా వచ్చేది అన్నారు. ఏమో... నేనింకా దరిద్రంగా తీసేవాణ్ణి ఏమో. నేను ఎన్టీఆర్ బయోపిక్ చూస్తే కంపేరిజన్స్ వస్తాయి. నేను అయితే ఎలా తీసేవాణ్ణి అనే ఆలోచన వస్తుంది. ఎవరైనా అడిగితే ఓపెన్ గా చెప్పేస్తా. అందుకని చూడలేదు" అని తేజ చెప్పారు.