చడీచప్పుడు లేకుండా పెళ్లాడిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' డైరెక్టర్
on Jul 16, 2020
'కృష్ణ అండ్ హిజ్ లీల' మూవీ ఓటీటీలో రిలీజయిన సందర్భంలో ఆ సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డకు డైరెక్టర్ రవికాంత్ పేరేపు లిప్‌కిస్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవడంతో, ఎందుకు తను సిద్ధుకు లిప్‌కిస్ ఇచ్చాడో వివరణ ఇచ్చి, ఆ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించాడు రవికాంత్.
ఇప్పుడు మరోసారి అందరినీ అతను ఆశ్చర్యపరిచాడు. అయితే ముద్దుతో కాదు, పెళ్లితో! అవును. చడీచప్పుడు లేకుండా తన ఫియాన్సీ వీణా ఘంటశాలను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం క్రితం ఆ ఇద్దరి నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వీణతో సెల్ఫీ ఫొటోను షేర్ చేసిన రవికాంత్, ఒక పెద్ద నోట్ పెట్టాడు. అందులో వీణను పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ ఆ పెళ్లి జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు.
"కృష్ణ అండ్ హిజ్ లీల సిరీస్‌లో చివరి పోస్ట్‌కు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తితో ముగింపు పలుకుతున్నాను. ఈ సినిమా తీసే సమయంలో వీణ, నేను మా అనుబంధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, పెళ్లి చేసుకున్నాం" అని అతను వెల్లడించాడు. "ఐదేళ్లు కలిసి చేసిన ప్రయాణంలో ఆమెలో ఓ గొప్ప ఫ్రెండ్‌ను చూశాను. ఎలాంటి స్థితిలోనైనా నాతో పాటు ప్రయాణించే వ్యక్తి ఆమె. మన అనుభవాలను పంచుకోడానికి ఓ వ్యక్తి ఉండటం క్రేజీ. ఎప్పుడు బాయ్ లాగా ఉండాలో, ఎప్పుడు మ్యాన్ లాగా ఉండాలో ఆమె నాకు నేర్పించింది" అంటూ భావోద్వేగపూరితంగా రాసుకొచ్చాడు రవికాంత్. వీణ ఘంటశాల డబ్బింగ్ కళాకారిణి కావడం గమనార్హం.
Also Read