ఫ్రాంక్‌గా చెప్పాలంటే 'వెంకీమామ'లో చైతన్య మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాం!
on Dec 10, 2019
"సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇద్దరు మేనమామ మేనల్లుళ్ల మధ్య జరిగే లవ్ స్టోరీ. దాంటో అల్లరి, ఏమోషన్, డ్రామా ఉంటుంది. నేను ఈ కథను అలానే చూశాను. ప్రధానంగా ఇది వాళ్ల మధ్య ప్రేమానుబంధానికి సంబంధించిన కథ. మిగతావనీ సపోర్టింగ్ క్యారెక్టర్లే. తొలిసారి మేనమామ చేతుల్లోకి మేనల్లుడు ఎప్పుడొచ్చాడు, తొలిసారి మేనమామ అంటే మేనల్లుడికి గౌరవం కలిగింది.. ఎప్పుడు మేనమామ కోసం ప్రాణం ఇవ్వాలనిపించింది.. వంటివి ఇందులో ఉన్నాయి. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తరహాలోనే వాళ్ల మధ్య ఆ ప్రేమను చూపాం" అని చెప్పారు 'వెంకీమామ' దర్శకుడు బాబీ అలియాస్ కె.ఎస్. రవీంద్ర.
ఈ మూవీలో వెంకటేశ్ పేరు వెంకటరత్నం నాయుడు. అందరూ మిలట్రీ నాయుడు అని పిలుస్తుంటారు. "మట్టిలో పనిచేసే రైతు, దేశం కోసం పోరాడే సైనికుడు.. ఈ ఇద్దరే సృష్టిలో చాలా గొప్పవాళ్లు అని నమ్మే వ్యక్తిత్వం అతనిది. మిలటరీలోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. అందుకే ఊళ్లో అందరూ ఆయనను మిలట్రీ నాయుడు అని పిలుస్తుంటారు. వాళ్ల నాన్న నాజర్ ఊరి పెద్దగా కనిపిస్తారు. మిలట్రీ నాయుడి దగ్గరకు ఏ సమస్య తీసుకుపోయినా దానికి పరిష్కారం దొరుకుతుందని అతని దగ్గరకు వస్తూ ఉంటారు. అతను రైస్ మిల్లు నడుపుతుంటాడు. హాస్టల్లో చదువుకొనే పేద పిల్లల కోసం ఉచితంగా బియ్యం పంపిస్తుంటాడు" అని తెలిపారు బాబీ.
చైతన్య పేరు కార్తీక్ శివరాం. "నాకు లభించిన ఇంకో సౌలభ్యం ఏమంటే, వాళ్లు సొంత మామా అల్లుళ్లు కావడం వల్ల ఒకరి పాత్రను మరొకరు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో చైతూకు మంచి పేరు రావాలని అటు సురేశ్‌బాబు గారు, ఇటు వెంకటేశ్ గారు.. ఇద్దరూ కంకణం కట్టుకున్నారు. దాంతో ఫ్రాంక్‌గా చెప్పాలంటే చైతన్య మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాం. అంటే ఈ సినిమాలో మేనల్లుడి రోల్ చాలా కీలకం. వెంకటేశ్ గారు కోరుకోవడం వల్లే మాకు ఆ పాత్రను బాగా ఎలివేట్ చేసే స్వేచ్ఛ దొరికింది. ఎవరి పాత్ర పరిధి ఎంత ఉండాలి అనే లెక్కలు వేసుకోకుండా తియ్యగలిగాం. అదే సమయంలో తన మాయ్వయ్య కేరెక్టర్ బాగా రావాలని చైతన్య కూడా తపించాడు. అలా వాళ్లిద్దరి ప్రేమానుబంధాలతో, పాజిటివిటీతో ముందుకెళ్లాం. వెంకటేశ్ గారు ఎమోషన్స్, ఫన్ బాగా చేస్తారని అందరికీ తెలుసు. మాస్ యాక్టర్‌గానూ ఇదివరకు ఆయన చాలా సినిమాల్లో మెప్పించారు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత ఆయనలోని మాస్ యాంగిల్‌ను చూపించాం. ఇక చైతన్యకు చాలా మంచి పేరొస్తుంది. ఏ ఆర్టిస్టుకైనా టఫెస్ట్ జాబ్ ఏంటంటే ఎమోషన్‌ను పండించడం. వెంకటేశ్ గారితో సమానంగా చైతన్య ఎమోషన్ పండించడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది" అని చెప్పుకొచ్చారు బాబీ.
Also Read