దిల్ రాజు... హిందీలో మరో తెలుగు సినిమా రీమేక్!
on May 26, 2020
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మధ్య రీమేక్ సినిమాల మీద పడ్డారు. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా 'ఇద్దరి లోకం ఒకటే' అని ఫ్రెంచ్ సినిమా రీమేక్ చేస్తే ప్లాప్ అయింది. శర్వానంద్, సమంత జంటగా తమిళ హిట్ సినిమా '96'ని తెలుగులో 'జాను'గా రీమేక్ చేస్తే సక్సెస్ రాలేదు. హిందీలో అయినా ఆయనకు రీమేక్ సినిమాలు సక్సెస్ ఇస్తాయో? లేదో?? పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన నిర్మిస్తున్న 'వకీల్ సాబ్' హిందీలో హిట్ అయిన 'పింక్'కి రీమేక్.
హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'జెర్సీ'ని దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. అల్లు అరవింద్, అమన్ గిల్ ప్రొడక్షన్ పార్టనర్షిప్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. బోనీ కపూర్ పార్టనర్షిప్ తో 'ఎఫ్ 2' రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన 'హిట్' సినిమా హిందీ రీమేక్ రైట్స్ దిల్ రాజు కొన్నారని తెలిసింది. హిందీలో ఏ హీరో అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారట. లాక్ డౌన్ తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంది.