సుశాంత్‌సింగ్ మూవీ ట్రైలర్ సరికొత్త రికార్డ్
on Jul 14, 2020
బాలీవుడ్ స్టార్ యాక్టర్ దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన చివరి చిత్రం 'దిల్ బేచారా' ఈ నెల 24న డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కానున్నది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో అది 10 మిలియన్ లైక్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. ఇప్పటివరకూ దానికి 72 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అంతర్జాతీయంగానూ 'దిల్ బేచారా' కొత్త రికార్డును సృష్టించడం మనకు తెలుసు. ఈ టైమ్‌లో దానికి 24.4 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ విషయంలో అది హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' రికార్డును కూడా బద్దలుకొట్టింది. 'అవెంజర్స్' సిరీస్ చివరి సినిమాకు ఇప్పటివరకూ వచ్చిన లైక్స్ 2.9 మిలియన్ మాత్రమే కావడం ఇక్కడ గమనార్హం.
వాస్తవానికి 'దిల్ బేచారా' మూవీ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకొనే అవకాశం కనిపించకపోవడంతో, నిర్మాతలు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. జూన్ 14న అంటే సరిగ్గా నెల రోజుల క్రితం సుశాంత్‌సింగ్ ఆత్మహత్య చేసుకోవడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనంతటినీ షాక్‌కు గురిచేసింది. ఆ స్టార్‌పై అభిమానం చాటుకుంటూ అనేకమంది చిత్రసీమ ప్రముఖులు 'దిల్ బేచారా' ట్రైలర్‌ను తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రమోట్ చేయడంతో ఇటు వ్యూస్ పరంగా, అటు లైక్స్ పరంగా అది రికార్డులు సాధిస్తోంది. జాన్ గ్రీన్ నవల 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఆధారంగా రూపొందిన 'దిల్ బేచారా' మూవీలో సుశాంత్‌సింగ్ జోడీగా కొత్తమ్మాయి సంజనా సంఘీ నటించింది. ఈ మూవీతో క్యాస్టింగ్ డైరెక్టర్ అయిన ముఖేశ్ ఛబ్రా డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు.