విడిపోయిన ఆ ఇద్దరిదీ ప్రేమవివాహం కాదు!
on Apr 12, 2021
నటి కల్యాణి, దర్శకుడు సూర్యకిరణ్ పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్ల క్రితం విడిపోయారు. బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సూర్యకిరణ్, ఆ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటికీ తాను కల్యాణిని ప్రేమిస్తూనే ఉన్నాననీ, కానీ తను ఎందుకనో నన్ను వద్దనుకున్నదనీ వాపోయి బాధపడ్డాడు.
అదట్లా ఉంటే, ఆ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్లది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అవును. ఆ విషయం ఆ ఇద్దరే స్వయంగా చెప్పారు. పెళ్లయిన కొత్తలో జంటగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే వారు ఈ విషయం వెల్లడించారు. తాను 'పెదబాబు' సినిమా చేస్తున్నప్పుడు ఆ సెట్స్‌కు వచ్చిన సూర్యకిరణ్‌ను తొలిసారి కలుసుకున్నాననీ, 'సత్యం' డైరెక్టర్‌గా అతడిని పరిచయం చేశారనీ, ఇద్దరమూ మలయాళం వాళ్లం అవడంతో మాట్లాడుకున్నామనీ కల్యాణి చెప్పారు.
తాను అప్పుడు కల్యాణి కాళ్లకు ఉన్న బంగారు పట్టీలు చూసి, వాటి గురించి అడిగాననీ, 'సత్యం' సినిమా హిట్టయ్యాక వచ్చిన అడ్వాన్స్‌లతో తన చెల్లెలికి అలాంటివాటిని కొనాలని అనుకున్నాననీ సూర్యకిరణ్ చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను అతను చెప్పుకొచ్చాడు. "మా అమ్మ, చెల్లెళ్లతో మేం చెన్నైలో ఓ సినిమాకి వెళ్లాం. అదే సినిమాకి కల్యాణి ఓ అబ్బాయితో కలిసి వచ్చింది. కల్యాణి అసలు పేరు కావేరి. మా అమ్మ ఆమెని చూసి, 'ఒరే.. ఆ కావేరి ఎవరినో లవ్ చేస్తున్నట్టుందిరా, ఎవరో అబ్బాయితో వచ్చింది చూడు.' అని చెప్పింది. నేను చూసి, ఓహో.. ఈమెకు ఇలాంటిది ఉందా అనుకున్నాను. తర్వాత థియేటర్లో వాళ్లూ, మేమూ మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయి కల్యాణి తమ్ముడని తెలిసింది. అప్పుడే మా చెల్లెళ్లు, కల్యాణి ఫ్రెండ్స్‌లా అయిపోయారు." అని తెలిపాడు సూర్యకిరణ్.
"నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'ధన 51' మూవీ ఓపెనింగ్‌కు కేరళ నుంచి మా దగ్గరి బంధువులందరూ వచ్చారు. అదే రోజు కల్యాణి వాళ్లమ్మ పుట్టినరోజు. ఆ రోజు కల్యాణి వాళ్ల ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి లంచ్ చేశారు. మా ఇద్దరి పేరెంట్స్ మాట్లాడుకున్నారు. అలా మా పెళ్లి ఫిక్సయింది." అని సూర్యకిరణ్ చెప్పగానే.. "అవును. మా పెళ్లి అలా ఫిక్సయ్యిందే" అని కల్యాణి కూడా అన్నారు.
పెళ్లయిన పదేళ్ల తర్వాత ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. వారికి పిల్లలు లేరు.
Also Read