మహేష్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్ వెనుక కథేంటి?
on Jan 10, 2020
‘సరిలేరు నీకెవ్వరు’లో మ...మ... మాస్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’. ఇందులో లుంగీ కట్టి... జుబ్బా వేసి... చేతికి మల్లెపూలు పెట్టి... సూపర్‌స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నారు. ఈ సాంగులో హీరోగారు మాస్ స్టెప్పులు ఇరగదీశారని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. షూటింగ్ చేసేవరకూ మహేష్ బాబు ఈ సాంగ్ చేస్తారో? లేదో? అని సందేహించానని దేవిశ్రీ తెలిపారు. ఈ పాట వెనుక ఆసక్తికర సంఘటనలను ఆయన పంచుకున్నారిలా...
‘‘నేను సంగీతం అందించిన ప్రతి హీరోకి ఒక మాస్ సాంగ్ ఇచ్చాను. చిరంజీవిగారికి ‘అమ్మడూ... లెట్స్ డూ కుమ్ముడు’, పవన్‌కల్యాణ్‌గారికి ‘కేవ్వు కేక’, అల్లు అర్జున్‌కి ‘రింగ రింగ’, ‘సూపర్ మచ్చి’... ఇలా! మహేష్‌గారితో ఇంతకు ముందు నాలుగు సినిమాలు చేశాను. కానీ, కథరిత్యా ఆయా సినిమాల్లో మాస్ పాటలు చేసే అవకాశం రాలేదు. సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఏమో ‘మా హీరోకి మాస్ సాంగ్ ఎప్పుడు ఇస్తావ్ అన్నా?’ అని ట్విట్టర్, సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఓపెనింగ్‌లో ‘మహేష్‌గారి చేత డ్యాన్స్ చేయించే పాటలు ఇస్తాను’ అని ప్రామిస్ చేశా. ఎలా? ఎలా? అనుకుంటున్న టైమ్‌లో ఒక రోజు దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చారు. ‘మహేష్‌గారు లుంగీ, జుబ్బా, మల్లెపూలు వేసుకుని సాంగ్‌లో డ్యాన్ చేస్తారు’ అని చెప్పారు. ఆయన చెబుతుండగా... నేను మధ్యలో ఆపి ‘మహేష్‌గారు ఇవన్నీ చేస్తారా?’ అని అడిగా. ‘నేనే ఏదో రకంగా ఒప్పిస్తా’ అని అనిల్‌గారు అన్నారు. సాకీలోనే ‘ఎప్పుడూ ఫ్యాంట్ వేసేవాడు లుంగీ కట్టాడు’ అని లిరిక్ రాసి ట్యూన్ చేశా. అప్పటికీ మహేష్‌గారు ఈ సాంగ్ చేస్తారో? లేదో? అనే సందేహంలో ఉన్నాను. ఒక రోజు సాంగ్ తీసుకువెళ్ళి మహేష్‌గారికి వినిపించా. ఆయన ‘ఏంటి? ఇప్పుడు ఇవన్నీ నేను వేసుకోవాలా?’ అని అడిగారు. మేం ‘ఊ’ అన్నట్టు తల ఊపాం. ‘మీరు ఇద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు’ అని నవ్వేశారు. సాంగ్ షూటింగ్ చేసేవరకూ నాకు సందేహమే... ఆయన చేస్తారో? లేదో? అని! చివరికి చేశారు. ఈ పాటలో మహేష్‌గారు స్టెప్పులు ఇరగదీశారు’’ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.
‘మైండ్ బ్లాక్’ సాంగ్‌లో మహేష్ చేత డైలాగ్స్ చెప్పించాలనే ఐడియా తనదేనని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ‘‘సాంగ్ ఫినిష్ చేశా. ఆడియన్స్‌తో ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్టు చూస్తే బావుంటుందనుకున్నా. ‘1 నేనొక్కడినే’లో ఒక సీరియస్ సీన్ జరుగుతుండగా... మధ్యలో మహేష్‌గారు ‘నువ్వు ఉండరా’ అని మళ్లీ సీరియస్ మోడ్‌లోకి వెళతారు. ఆయన కామెడీ టైమింగ్ నాకు ఇష్టం. అందుకని, ఆయనతో ఆ డైలాగ్స్ చెప్పించా. నాలుగు రోజుల్లో సాంగ్ విడుదల అవుతుందనగా... బిజీ షెడ్యూల్లోనూ ఆయన మాకోసం టైమ్ కేటాయించి డైలాగ్స్‌కి డబ్బింగ్ చెప్పారు’’ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.