`అర్జున్ రెడ్డి` లాగే డియర్ కామ్రేడ్ కనిపిస్తున్నాడు!!
on Jul 11, 2019
విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా 'డియర్ కామ్రేడ్'. గురువారం ఉదయం ట్రైలర్ విడుదల చేశారు. స్టేట్ లెవల్ క్రికెట్ ప్లేయర్‌తో లవ్‌లో పడే అబ్బాయి కథ. 'గీత గోవిందం' తరవాత మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జోడి నటిస్తున్న చిత్రమిది. ట్రైలర్లో ఇద్దరి కెమిస్ట్రీ, ఘాటు ముద్దులు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'శివ' టైపులో కాలేజ్ రాజకీయాలు ఎలానో ఉండనే ఉన్నాయి. ట్రైలర్ అంతా బాగుంది కానీ... చూస్తున్నంతసేపు మధ్య మధ్యలో 'అర్జున్‌రెడ్డి' గుర్తొస్తున్నాడు. బహుశా... కాలేజీలో కొట్లాటలు, ఎగ్రెస్సివ్ యాంగ్రీ యంగ్‌మ్యాన్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ నటించడం వలన ఏమో! కోపాన్ని అదుపులో పెట్టుకోలేని క్యారెక్టర్ని 'అర్జున్‌రెడ్డి'లో విజయ్ దేవరకొండ చేశాడు. అందులో మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోమని హీరోయిన్‌పై హీరో ఆగ్రహం వ్యక్తం చేసే సన్నివేశం ఉంటుంది. 'డియర్ కామ్రేడ్' ట్రైలర్లో ఇంచుమించు అలాగే రష్మికపై విజయ్ దేవరకొండ కోప్పడే సన్నివేశం ఉంది. 'అర్జున్‌రెడ్డి'లో ఫుట్‌బాల్ కోర్టులో ఫైట్‌ని తలపించేలా 'డియర్ కామ్రేడ్' ట్రైలర్లో కాలేజీ కొట్లాటలు ఉన్నాయి. రెండూ వేర్వేరు సినిమాలు. రెండిటి కథానేపథ్యం వేర్వేరు. మూడు నిమిషాల ట్రైలర్ చూసి సినిమాను జడ్జ్ చేయలేం. కానీ, 'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చూస్తుంటే 'అర్జున్‌రెడ్డి' గుర్తొస్తున్నాడు. ఆ సినిమా, అందులో విజయ్ దేవరకొండ ప్రదర్శించిన నటన ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అటువంటిది.
Also Read