ఫస్ట్ రానా.. నెక్ట్స్ అభిరామ్..
on Jul 27, 2021
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తరువాత దగ్గుబాటి కుటుంబం నుంచి మరో కథానాయకుడు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అయిన దగ్గుబాటి అభిరామ్.. త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సంచలన దర్శకుడు తేజ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ నిర్మించనున్నారు. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి బాణీలందించనున్నారు. `అహింస` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రకని ఓ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించేందుకు సముద్రకని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. త్వరలోనే తేజ - అభిరామ్ ప్రాజెక్ట్ లో సముద్రకని ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో అభిరామ్ అన్న రానాతో కలిసి నటిస్తున్నారు సముద్రకని. కట్ చేస్తే.. ఆ సినిమా విడుదలయ్యేలోపే అభిరామ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపాడాయన. మరి.. ఫస్ట్ రానా - నెక్ట్స్ అభిరామ్ అన్నట్లుగా సముద్రకని చేస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.