English | Telugu

సునీల్ వెళ్తున్న దారి కరెక్టేనా?

on Sep 12, 2017


సునీల్ రూట్ కరెక్టేనా? కెరీర్ విషయంలో తను తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే అతని జీవిత కూడా. నవరసాల్లో కష్టమైనది హాస్యరసం. దాన్ని పలికించగలిగితే.. మిగిలినవి కరతాలమలకం. హాస్యాన్ని సునీల్ ఎంత బాగా పండిస్తాడో తెలిసిందే. ఇక మిగిలిన ఎమోషన్లు తనకి పెద్ద విషయం కాదు కదా. బహుశా.. తనలోని ఈ కోణాన్ని చూసే.. ‘అందాల రాముడు’లో హీరో చేసి ఉంటారు. ఏది ఏమైనా బిజీ కెమెడియన్ అయిన సునీల్ ‘అందాల రాముడు’తో హీరో అయిపోయాడు.. సంతోషం.

హీరో అయ్యాను కదా అని.. సునీల్ చెట్టెక్కలేదండోయ్. ఆ హిట్ తర్వాత కూడా కామెడీ వేషాలు కొనసాగించాడు. ఎప్పుడైతే.. రాజమౌళీ తనతో ‘మర్యాద రామన్న’ తీశాడో.. అక్కడ్నుంచి ఈ గోదారి కుర్రాడిలో కొత్త ఆశలు చిగురించాయ్. హీరో అనిపించుకోవాల్సిందే... అని గట్టిగా అనేసుకున్నాడు. జిమ్ములో బిజీ అయిపోయాడు. కిలోలకొద్దీ తగ్గి.. ‘పూలరంగడు’గా జనాల ముందుకొచ్చాడు. అదృష్టం బావుండి అదీ హిటయ్యి కూర్చుంది. ఇక మనోడు భూమ్మీద ఆగలా. నేనూ ఓ స్టార్ హీరోనే అని ఫిక్సయిపోయాడు.

ఆనందం! పరమానందం! బ్రహ్మానందం! తెలుగు సినిమాకు మరో మంచి హీరో దొరికాడు. అయితే... సునీల్ ని ఎలాంటి హీరోగా చూడాలని జనాలు అనుకుంటున్నారు? ఎలాంటి పాత్రలు సునీల్ కి కరెక్ట్? ఈ విషయాల్లోనే సునీల్ పప్పులో కాలేశాడు. ఇంకా మాట్లాడితే..సాంబారులో మొఖం పెట్టాడు.

హీరో అయినప్పట్నుంచీ మనోడి దృష్టంతా.. స్టార్ డమ్ మీదే. సిక్స్ ప్యాక్ చేయడాలూ, చిరంజీవి లెవల్లో డాన్సులు ఇరగదీసేయడాలూ, పంచ్ డైలాగులూ, పదిమందికి ఒక్కడే కొట్టేయడాలూ.. ఇలాంటి స్టార్ హీరోల అసహజ వికృత చేష్టల్ని తను కూడా తెరపై చేయడం మొదలెట్టాడు.

సరిగ్గా అక్కడే.. అక్కడే.. జనానికి కోపం వచ్చింది. ‘హన్నన్నా... మేమేదో... కుర్రాడ్ని హీరోని చేస్తే.. ఇతనేంటి? రాంగ్ రూట్ లో వెళుతున్నాడు?’ అనుకున్నారు. దారిలో పెట్టడం మొదలుపెట్టారు. ఇక లైన్లో ఫ్లాపులు పలకరించాయ్. రేపు ‘ఉంగరాల రాంబాబు’గా మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నాడు సునీల్. మరి ఈ దఫా అయినా.. సరైన దారిలో వెళ్లాడా? అనేది చూడాలి.

హీరోగా సునీల్ ప్రయాణించడానికి జనాలు నిర్దేశించిన దారేంటి? అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎన్టీయార్ సినిమాను ఏలుతున్న రోజుల్లోనే ‘చలం’ అని ఓ నటుడు ఉండేవాడు. తెలుగు తెరకు తొలి కామెడీ హీరో ఆయనే. రేలంగి, కస్తూరి శివరావ్, పద్మనాభం.. అంతకు ముందు హీరో వేషాలు కొన్ని సినిమాల్లో వేసినా.. ఓ కామెడియన్ కి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన తొలి హీరో మాత్రం చలమే. అప్పట్నుంచి... వెండితెరపై కథానాయకుని ప్రయాణంలో ఓ కొత్తదారి ఆవిష్కృతం అయ్యింది. అదే కామెడీ హీరో. చలం కథానాయకునిగా మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లోడు, సంబరాల రాంబాబు, బొమ్మ బొరుసా, సత్తెకాలపు సత్తెయ్య, తోట రాముడు, లంబాడోళ్ల రాందాసు... ఇలా సినిమాలొచ్చాయ్. దాదాపు అన్నీ విజయాలే.

‘చలం’ తర్వాత ఆ దారి ఎంచుకొని ముందుకు సాగిన హీరోలు రాజేంద్రప్రసాద్, నరేశ్. కామెడీ సినిమాలకు స్వర్ణయుగం అంటే.. వీరి హయాంలోనే. కామెడీ చిత్రాల్లో నటిస్తూనే.. అప్పుడొప్పుడు ఎమోషన్లతో కూడా ఆడుకునేవారు ఈ ఇద్దరూ. ముఖ్యంగా కామెడీ హీరోగా రాజేంద్రప్రసాద్ ది సువర్ణాధ్యాయం. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాక నంబర్ స్థానం ఎలాగైతే.. ఖాళీగా ఉండిపోయిందో... కామెడీ సూపర్ స్టార్ గా రాజేంద్రప్రసాద్ స్థానం కూడా అలాగే ఖాళీగా ఉండిపోయింది. దాన్ని భర్తీ చేసే నటుడి కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. అల్లరి నరేశ్ ప్రయత్నం కూడా ఈ విషయంలో విఫలమే అయ్యింది. ప్రస్తుతం జనాలు సునీల్ కి చూపించిన దారి కూడా ఇదే. ఆ దారిలో వెళ్తే సునీల్ కి వరుస విజయాలే. కానీ... అటు వెళ్లకుండా... తనది కాని దారిలో వెళ్తూ ఎదురుదెబ్బలు తింటున్నాడు. ఇకనైనా కళ్లు తెరిచి, హాస్యేంద్రుని వారసుడిగా ముందుకెళ్తే... సునీల్ కి హీరోగా విజయం తథ్యం

Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here