ENGLISH | TELUGU  

సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా? ఉండదా?

on Sep 23, 2017

 

సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందా? ఉండదా?.. ఈ అంశంపై ఈ మధ్య మీడియా సర్కిల్ లో చర్చలు ఎక్కువయ్యాయ్. ‘అర్జున్ రెడ్డి’  విషయంలో ఈ చర్చ మొదలైంది.  మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మ కూడా దీనిపై స్పందిస్తూ... ‘సినిమాలు చూసి మారిపోయేంత బలహీన మనస్కులు కాదు జనాలు’ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. వర్మ అభిప్రాయాన్ని ఏకీభవించిన వారూ ఉన్నారూ.. వించని వారూ ఉన్నారు. 

నిజంగా సినిమా... జనంపై ప్రభావం చూపించలేదా? అదే నిజమైతే... ఎన్టీయార్, ఎమ్జీయార్ లాంటి సూపర్ స్టార్లు తెరపై ఏదో ఒక మంచి చెప్పడానికి ఎందుకు తాపత్రయపడేవారు? జనాలు వినరు కదా! ప్రభావితం కారు కదా! మరీ ముఖ్యంగా ఎమ్జీయార్ అయితే... తెరపై సిగరెట్ తాగుతూ కూడా కనిపించేవారు కాదు. ఆయన తాగితే ప్రభావితమై అభిమానులు కూడా తాగేస్తారని ఆయన భయం. అయ్యో... ఎందుకు పాపం... ఇంత అమాయకంగా ఆలోచించారు వీళ్లు? మన ‘వర్మా అండ్ పార్టీ’కి తెలిసినంత కూడా వీళ్లిద్దరికీ తెలియకపోవడం బాధాకరం కదా! 

 

 

‘దేవదాసు’కు ముందు... విఫల ప్రేమికుడంటే... బొమ్మలు గీసుకుంటూనో.. కవితలు రాసుకుంటూనో  కనిపించేవారట. ‘దేవదాసు’ వచ్చాడూ... పద్ధతి మార్చేశాడు. ‘మరుపు కావాలంటే మద్యానికి మంచిన మందు లేదు’ అని మత్తుగా..జగత్తుకు చాటాడు. అప్పట్నుంచి మద్యం వసూళ్లు ఏ స్థాయిలో పెరిగాయో... అప్పటి గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ‘దేవదాసు’ కళాఖండమే. కాదని ఎవరూ అనరు. అయితే... శరత్ చంద్ర.. పాపం.. నవల మాత్రమే రాసి ఊరుకున్నాడు. కానీ...  మన రాఘవయ్య గారు.. ఏకంగా‘దేవదాసు’ని తెరెక్కించేశాడు.  తెరెక్కిన ‘దేవదాసు’.. ఊరుకుంటాడా! బ్రాందీ షాపుల సైన్ బోర్డులపై కూడా ఎక్కేశాడు. ఆ గ్లాస్ పట్టుకునే తీరు చూసి మురిసిపోయిన.. ట్యాక్స్ పేయర్లు.. అదేనండీ మందుబాబులు అప్పట్లో కోకొల్లలట. అదేం పెద్ద ప్రభావం చూపించిన అంశం కాదనుకోండీ!.

 

 

‘మాయా బజార్’లో కృష్ణుని గెటప్ లో ఉన్న ఎన్టీయార్ స్టిల్ ని... కేలండర్ గా వేయించి.. తెలుగునేలపై పంచారట నిర్మాతలు. అవి ముందు గోడలెక్కాయ్. ఆ తర్వాత ఏకంగా పూజా మందిరాల్లో తిష్టవేసుక్కూర్చున్నాయ్. మీరు నమ్మినా.. నమ్మకపోయినా పచ్చినిజం ఒకటి చెప్పమంటారా? ఇప్పటికి కూడా తెలుగు నేలపై పూజలందుకుంటున్న ఎన్టీయార్ కృష్ణరూప విగ్రహాలున్నాయ్.. తెలుసా?.. అది కూడా పెద్ద ప్రభావితం చేసిన అంశం కాదనుకోండీ! 

పాత సినిమాలను బాగా చూసిన వారికి ఓ విషయం అర్థమై ఉండాలి. అవుడ్డోర్ షూటింగుల్లో... వెనక ఉన్న జానాలను గమనిస్తే... విచిత్రంగా ఒక్కొక్కడూ ఒక్కో అక్కినేనిలా కనిపిస్తుంటాడు. అదే డ్రస్ కోడ్.. అదే నడక... అలాగే నిలబడటం. అంతెందుకు? ఎప్పుడైనా.. నాగేశ్వరరావు విమానం దిగుతున్న సన్నివేశం చూడండి. ఆయనతో ఫ్లైట్ దిగేవాళ్లు కూడా ఆయనలాగే కనిపిస్తారు. అంటే...  ఆయన స్టైల్ అప్పట్లో అంతగా ప్రభావితం చేసిందనమాట. అది నా అభిప్రాయం లేండీ... చెప్పాలనిపించి చెబుతున్నా. అది కూడా పెద్దగా ప్రభావితం చేసిన అంశం కాదనుకోండీ. 

 

 

‘ఎదురులేని మనిషి’ అని ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమా కోసం ఎన్టీయార్ స్టైల్ మార్చారు. బాబీ కాలర్... బెల్ బాటమ్ ప్యాంట్ ధరించారు. నిజానికి బాలీవుడ్ లో అంతకు ముందే ఆ స్టైల్ మొదలైనా.. మనవాళ్లకు అలవాటైంది మాత్రం అప్పట్నుంచే. ఆ రోజుల్లో ఎన్టీయార్ స్టైల్ ఫాలో అవ్వని మనిషి లేడు. ఈ స్టైల్లో ఎన్టీయార్ కి బట్టలు కుట్టిన కంపెనీ పేరు ‘యాక్స్ టైలర్’. ఆ తర్వాత తెలుగు నేలపై ప్రతి ఊళ్లో  ఒక ‘యాక్స్ టైలర్’ వెలిసింది. ‘యాక్స్ టైలర్’ అంటే అదో బ్రాండ్ అయ్యింది. ఆ పేరున్న టైలరింగ్ షాపులో బట్టలు కుట్టించుకోవడం అప్పట్లో క్రేజ్. ఆ పేరు మీదే చాలామంది టైలర్లు బతికేశారు. అది కూడా పెద్దగా ప్రభావితం చేసిన అంశం కాదులేండి. 

 

 

వాణిశ్రీ చీరలు.. వాణిశ్రీ జాకెట్లు.. వాణిశ్రీ బొట్టు బిళ్లలు... వాణిశ్రీ హెయిర్ స్టైల్... వాణిశ్రీ హెయిర్ పిన్స్... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే... పెద్ద లిస్టే అవుతుంది. ఆ రోజుల్లో ఆడాళ్లందరూ వాణిశ్రీలే. చివరకు షోరూమ్స్ బయట షర్మిలా ఠాగూర్ బొమ్మలు పెడితే.. వాటిని కూడా వాణిశ్రీ బొమ్మలే అనుకునేవారు పిచ్చి జనం. ఇది కూడా పెద్ద ప్రభావితం చేసిన అంశం కాదులేండి. 

 

 

ముఖానికి రంగులేసుకునే ఓ నటుడు.. బయటకొచ్చి రాజకీయ పార్టీపెట్టి ఓటు అడిగితే... అతడ్ని ఏకంగా ముఖ్యమంత్రిని చేసిపారేశారు జనాలు.. మరి ఆయన అంతగా ఏం ప్రభావితం చేశాడు వీళ్లని? నాకర్థంకాదు. 

 

 

‘ప్రేమాభిషేకం’ సినిమాకు ముందు ‘కేన్సర్’ వ్యాధి అంటే చాలామందికి తెలీదు. ఆ సినిమా కొన్ని కోట్లమందికి కేన్సర్ పై అవగాహన పెంచింది. దీన్ని బట్టి.. సినిమా ప్రభావితం చేయకపోయినా... ఎలాంటి విషయం పైనయినా.. అవగాహన పెంచుతుందని మాత్రం నమ్మొచ్చు. 

తెలుగు నేలపై ‘రికార్డింగ్ డాన్స్’ అనే సంప్రదాయం మొదలవ్వడానికి ప్రభావితం చేసిన అంశాలేంటి? నాకు తెలీక అడుగుతున్నా. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలామంది కళాకారులకు అదే భుక్తి. వాటి పుణ్యమా అని... కొన్ని కుటుంబాలు బతికేశాయ్. ఏ విషయంపై ప్రభావితమై.. ఈ సంప్రదాయం పుట్టింది? 

 

 

చిరంజీవి... అప్పటి యువతరానికి రోల్ మోడల్ ఆయన.  చిరంజీవిని ప్రేరణగా తీసుకొని హీరో అవుదామని మద్రాస్ రైలెక్కిన వాళ్ల సంఖ్య చాంతాడంత. హీరోలు అయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు కదండీ. చిరంజీవిలా ఫైటింగులు చేద్దామని ప్రయత్నించి మోకాళ్లు పగలగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. చిరంజీవి ప్రభావం వల్ల గొప్ప డాన్సర్లయిన వాళ్లూ ఉన్నారు. కాదంటారా? 

 

 

‘శివ’.. ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా ముందు వరకూ.. తలకు నూనె పెట్టి పక్కకు దువ్వుకునేవాడ్ని. ఆ సినిమా చూసీ... తలకు నూనె పెట్టడం మానేశా. పక్కకు దువ్వేవాడ్ని కాస్తా...  పైకి దువ్వడం మొదలుపెట్టా. హ్యాండ్ కప్స్ పెట్టుకొని.. బుద్ధిగా స్కూల్ కి వెళ్లే నేను.. హ్యాండ్స్ ని మణికట్లు వరకూ మడిచా. సైకిల్ చెయిన్ ని మరోలా ఉపయోగించొచ్చన్న విషయం కూడా నాకు ‘శివ’ చూశాకే తెలిసింది. లాకప్ లో కూడా పడ్డా. ‘ఉందిగా సెప్టెంబర్.. మార్చి పైనా’అనే విషయం కూడా ఆ సినిమాతోనే తెలిసింది. టెన్త్ తప్పా. 


విచిత్రం చెప్పమంటారా? ‘శివ’లో వర్మగారు చెప్పిందీ.. ‘రౌడీజం నశించాలి’ అని. కానీ... అది ఎవరికీ వంటబట్టలా. ఇంకా మాట్లాడితే... సందుకొక ‘భవాని’ తయారయ్యాడు. వీధి కొక గూండా పుట్టుకొచ్చాడు. అందులో రఘువరన్ ధరించిన స్పన్ షర్ట్స్ కూడా తెగ అమ్ముడుపోయాయండోయ్. సెంటర్ కి ఒక గ్రూప్ తయారైంది. మరి ఇంతమంది యువకుల జీవితాలపై ‘శివ’ చూపించింది.. ప్రభావం కాదా? వీరందరినీ ‘శివ’ ప్రభావితం చేయలేదా?

 

 

‘గీతాంజలి’ పుణ్యమా అని ప్రేమికులు పెరిగితే... తేజా ‘చిత్రం’ తర్వాత టీనేజ్ లవ్వులు పెరిగాయ్. సాక్ష్యాలు కావాలా? 
సినిమా పక్కీలో మర్డర్లు.. సినిమా పక్కీలో రేప్ లు ఎన్ని జరగలేదు... చెప్పండి? ఇదంతా ప్రభావితం అవ్వడం వల్ల జరిగినవి కాదంటారా?  

 

 

అంతెందుకు... ‘సినిమాకు అంత సీన్ లేదు’ అని ఏకరవు పెడుతున్న సోకాల్డ్ సినిమావాళ్లను ఒకటే అడుగుతున్నా... సొంత ఊళ్లని సైతం వదిలేసి.. హైదరాబాద్ ఎందుకొచ్చారు? ఎందుకు దర్శకులయ్యారు. ఎందుకు కెమెరామేన్లయ్యారు? ఎందుకు నిర్మాతలయ్యారు? ఎవరూ ప్రభావితం చేయకుండానే హీరోలయ్యారా? సమాధానం చెప్పండి? 

చివరిగా చెప్పే విషయం ఒక్కటే... మంచి చేదుగా ఉంటుంది. చెడు రుచిగా ఉంటుంది. అందుకే... చెడు వేగంగా జనాల్లోకెళ్లిపోతుంది. కళాత్మక వృత్తిలో ఉండేవాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎందుకంటే... కళలే ప్రభావిత సాథకాలు. మంచైన చేదుని రుచిగా అందించడానికి ప్రయత్నిండండి. అంతే తప్ప.. తేలిగ్గా అమ్ముడైపోతోంది కదా.. అని చెడు రుచిని జనాలు మరిగేట్టు చేస్తే... సమాజం మురిగిపోతుంది... జాగ్రత్త. 

 

ఎన్.బి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.