విజయం ఎప్పుడు వస్తుందో?
on Mar 13, 2019
అతడి పేరు విజయ్. పేరులో ఉన్న విజయం తన జీవితంలోకి ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తుంటాడు - ఇదీ 'చిత్రలహరి'లో హీరో సాయిధరమ్ తేజ్ క్యారెక్టరైజేషన్. ఇది వెంటనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... విజయం కోసం చకోర పక్షిలా సాయిధరమ్ తేజ్ ఎదురు చూస్తుండటం. మెగా మేనల్లుడు నటించిన లాస్ట్ ఆరు సినిమాలు ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. రెండు... యువతలో చాలామంది విజయం కోసం ఎదురు చూస్తూ ఉండటం!
సాయిధరమ్ తేజ్ హీరోగా 'సెకండ్ హ్యాండ్', 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'చిత్రలహరి'. బుధవారం సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో హీరో హీరోయిన్ల పాత్రలతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న సునీల్ పాత్రను పరిచయం చేశారు. 'మగాళ్లందరూ సేమ్. మనల్ని రీచ్ అయ్యేంతవరకూ ఒకలా ఉంటారు. రీచ్ అయ్యాక అందరూ ఒకేలా ఉంటారు' అనే మహిళ పాత్రలో నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. తన గురించి ఏం చెప్పాలో తనకే తెలియక తికమకకు గురయ్యే పాత్రలో కల్యాణీ ప్రియదర్శన్ నటిస్తున్నారు. వైన్ షాప్ ఓనర్ ఐదు రూపాయలు చిల్లర లేదని మూంగ్ డాల్ ప్యాకెట్ ఇస్తే.. నిన్న ఇచ్చిన ప్యాకెట్ తిరిగిచ్చి పది రూపాయలు ఇవ్వమని అడిగే రకం సునీల్.
సినిమా హీరో క్యారెక్టర్ గురించి ముందే చెప్పుకున్నాం కదా! 'నా పేరు విజయ్. పేరులో ఉన్న విజయం నా జీవితంలోకి ఎప్పుడు వస్తుందో?' అని సాయిధరమ్ తేజ్ డైలాగ్ చెప్పగానే... కరెంట్ పోతుంది. బార్ లో పనిచేసే కుర్రాడు 'వచ్చినప్పుడు (విజయం) చూసుకుందులే అన్నా. నీ దెబ్బకు కరెంట్ కూడా పోయింది' అని చెప్పడం ప్రేక్షకులు చిన్నగా నువ్వుకునేలా చేసింది. చివర్లో 'వచ్చేదేదో (మంచి రోజుని) ఆదివారం రమ్మను. ఇంట్లో ఖాళీగా ఉంటాను' అని డైలాగ్ కూడా బావుంది. మొత్తం మీద టీజర్లో హిట్ కళ కనిపించింది. దీంతో సాయిధరమ్ తేజ్ హిట్ అందుకునేలా ఉన్నాడు.