మెగాస్టార్ 'లూసిఫర్' రీమేక్ స్క్రిప్ట్ రైటర్‌గా సత్యానంద్!
on Jan 21, 2021
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 'లూసిఫర్' రీమేక్ లాంఛనంగా మొదలైంది. 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మూడు బేనర్లు కలిసి నిర్మిస్తున్నాయి. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందనుంది. ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.
చిరంజీవి సినిమాకు డైరెక్షన్ చేసే చాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని మోహన్ రాజా అన్నారు. ఆయన ఫ్యాన్స్ కోరుకొనే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. 'లూసిఫర్'కు ఇది మక్కీకి మక్కీ కాపీ కాదనీ, మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు చేర్పులతో ఈ సినిమా స్క్రిప్టును రూపొందించరానీ సమాచారం. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
చిరంజీవి నటిస్తోన్న ఈ 153వ సినిమా ఆయన కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని నిర్మాత ఎన్వీ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి చిత్రానికి తమన్ పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో పలు చిరంజీవి చిత్రాలకు రచయితగా పనిచేసిన సత్యానంద్ ఈ సినిమా స్క్రిప్ట్‌లో పాలు పంచుకుంటున్నారు.
Also Read