పవన్ చేస్తానంటే నేను వదులుకుంటా!
on Apr 6, 2020
మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించగా మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మలయాళ మూవీ 'లూసిఫర్' బ్లాక్‌బస్టర్ హిట్టయి, మలయాళ చిత్రసీమలోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో డబ్బయి రిలీజైనా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చడంతో రామ్‌చరణ్ చేత తెలుగు రీమేక్ రైట్స్ కొనిపించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై ఈ సినిమాని తనే హీరోగా చేయాలనేది మెగాస్టార్ ఆలోచన. అయితే ఇటీవల ఈ సినిమాని చిరంజీవి వదులుకున్నారనీ, పవన్ కల్యాణ్ చేయబోతున్నారనీ ప్రచారంలోకి వచ్చింది.
ఇది కేవలం వదంతి మాత్రమేనని చిరంజీవి తేల్చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 'లూసిఫర్'ను తాను వదలుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే పవన్ కల్యాణ్ కనుక ఆ సినిమా చేయాలనుకుంటే, అతని కోసం దాన్ని తను వదులుకుంటానని చెప్పారు. లేకపోతే తనే ఆ సినిమా చేస్తానని చెప్పారు. డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదని కూడా చిరంజీవి తెలిపారు.
'లూసిఫర్' తెలుగు రీమేక్ స్ర్కిప్టును ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే అతను ఈ సినిమాను డైరెక్ట్ చేయడం లేదనీ, 'సాహో' డైరెక్టర్ సుజిత్‌కు ఈ అవకాశం దక్కనుందనీ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆఖరుకి వి.వి. వినాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు చిరంజీవితో రెండు రీమేక్ సినిమాలు - 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' తీసి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు వినాయక్. అందుకే ఆయనకు 'లూసిఫర్' రీమేక్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నాయి చిరంజీవి సన్నిహిత వర్గాలు.